Home వార్తలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి బీజేపీ అభ్యర్ధనను హైకోర్టు తోసిపుచ్చింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలు నిర్వహించిన ముగ్గురు వ్యక్తులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలను పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసు దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయ్యింది. ఈ కేసు దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సీపీ ఆనంద్ నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందం (సిట్) ను నియమించి దర్యాప్తు జరుపుతోంది.

అయితే ఈ కేసును సీబీఐ ద్వారా గానీ లేక ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపేలా అదేశాలు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జల ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇవేళ తీర్పు ఇచ్చింది. బీజేపీ విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. అయితే సిట్ అధ్వర్యంలోనే దర్యాప్తు కొనసాగించాలని ఆదేశిస్తూ దర్యాప్తును జస్టిస్ విజయసేన్ రెడ్డి పర్యవేక్షిస్తారని ధర్మాసనం తెలిపింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ దర్యాప్తును పారదర్శకంగా చేయాలని దర్మాసనం ఆదేశించింది. దర్యాప్తునకు సంబంధించిన విషయాలను మీడియాకు, రాజకీయ నాయకులకు వెల్లడించేందుకు వీల్లేదని స్పష్టం చేస్తూ.. కేసు దర్యాప్తుపై పురోగతిని ఈ నెల 29వ తేదీ లోగా జస్టిస్ విజయసేన్ రెడ్డి కి సమర్పించాలని సీజే నేతృత్వంలోని ధర్మాసనం దేశించింది.

Exit mobile version