Home వార్తలు అమరావతి కేసులు 28కి వాయిదా

అమరావతి కేసులు 28కి వాయిదా

రాష్ట్ర విభజన, అమరావతి రాజధాని పిటిషన్ల ను విడివిడిగానే విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఏపి విభజనకు సంబంధించి 28, రాజధాని అమరావతికి సంబందించి ఎనిమిది పిటిషన్లు జస్టిస్ కేఎం జోసఫ్, జస్టిస్ రుషికేశ్ రాయ్ ల నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు సోమవారం వచ్చాయి. ఈ సందర్భంలో రాష్ట్ర విభజన, అమరావతి రాజధాని కేసులు రెండు వేటికవే విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వీ, మాజీ అటర్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ధర్మాసనాన్ని కోరారు.ఏపి హైకోర్టులో రైతులు కోర్టు దిక్కరణ పిటిషన్లు వేశారని కేకే వేణుగోపాల్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. సుప్రీం కోర్టులో విచారణ పూర్తి అయ్యే వరకూ హైకోర్టులో కోర్టు దిక్కరణ పిటిషన్ల పై రైతులు ఒత్తిడి తీసుకురాకపోవచ్చని ధర్మాసనం పేర్కొంది.

రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలను ఏపి ప్రభుత్వం తరపు న్యాయవాది వైద్యనాథన్ ధర్మాసనానికి వివరించి హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరారు. తదుపరి విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం ఆ రోజు విచారణలో స్టే ఇవ్వాలా వద్దా అనే దానిపై దృష్టి పెడతామని తెలిపింది.

Exit mobile version