Home వార్తలు ఏపి ప్రభుత్వ సిట్ పై ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు..

ఏపి ప్రభుత్వ సిట్ పై ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు..

ఏపి ప్రభుత్వ సిట్ పై హైకోర్టు విధించిన స్టే పై సుప్రీం కోర్టు లోవాదనలు ముగిసాయి. ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. గత ప్రభుత్వ విధాన నిర్ణయాలు, ఆర్ధిక నిర్ణయాలు, ఇతర అంశాల దర్యాప్తునకు ఏపి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఏపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై స్టే విధించింది. దీంతో ఏపి ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.

సుప్రీం కోర్టులో జస్టిస్ ఎంఆర్ షా, ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది. రెండు రోజులు (బుధ, గురువారం) విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ, టీడీపీ నేతల తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ దవే వాదనలు వినిపించారు. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకే ఒక పోలీస్ స్టేషన్ లో సిట్ ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ తరపు న్యాయవాది సింఘ్వీ ధర్మాసనానికి నివేదించారు. నిజ నిర్ధారణ పూర్తి చేశామనీ, పక్షపాతం ఉండకూడదనే సీబీఐ దర్యాప్తు కోరుతున్నామని చెప్పారు. కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ లు దాఖలయ్యాయని, ప్రభుత్వం నేరుగా నమోదు చేయలేదని తెలిపారు. అమరావతి భూకుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ విచారణ కాకుండా నిజ నిర్ధారణ మాత్రమే చేసిందన్నారు. ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించవచ్చని, నిజ నిర్దారణ పై నిషేదం ఉండదని స్పష్టం చేస్తూ ఈ మేరకు తీర్పులను ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.

రాజకీయ దురుద్దేశంతోనే ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిందని టీడీపీ నేతల తర్పు న్యాయవాది దవే వాదనలు వినిపించారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉనప్పుడు టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలపై ఒక్క పిటిషన్ కూడా వేయలేదని చెప్పారు.  రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపితే తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. రాజకీయ నేతలతో విచారణ జరపడం ఏమిటని దవే ప్రశ్నించారు. కమిటీలో ఎవరూ స్వతంత్రులు లేరనీ, అంతా వైసీపీ నేతలే ఉన్నారని దవే ధర్మాసనానికి తెలిపారు.  సిట్ విచారణ తర్వాతే కోర్టులో సవాల్ చేయవచ్చు కదా అని ధర్మాసనం ప్రశ్నించగా, అంత సమయం ఇవ్వకుండా అరెస్టుల పర్వం మొదలు పెట్టారని దవే తెలిపారు. హైకోర్టు స్టే విధించినా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై సుప్రీం కోర్టు విస్మయాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజా ధనం దుర్వినియోగం, వృధా ఉంటే దర్యాప్తు చేయకూడదా అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. ఎవరైనా లావాదేవీలు దురుద్దేశపూరితంగా జరిగాయని భావిస్తే అది విచారించదగినదే కదా అని ప్రశ్నించింది. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది.

Exit mobile version