Home వార్తలు తునిలో టీడీపీ నేతపై హత్యాయత్నం .. దుండగుడు ఎలా వచ్చాడంటే..?

తునిలో టీడీపీ నేతపై హత్యాయత్నం .. దుండగుడు ఎలా వచ్చాడంటే..?

కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నేత, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం అయ్యింది. శేషగిరిరావు అప్రమత్తంగా ఉండటంతో గాయాలతో బయటపడ్డారు.  పొల్నాటి శేషగిరిరావు ఇంటికి ఓ దుండగుడు భవానీ మాలధారణ వేషంలో బిక్ష కోసమని వచ్చాడు. శేషగిరిరావు ఇంటి బయటకు వచ్చి అతనికి బిక్ష వేస్తుండగా, దుండగుడు తన వెంట తెచ్చిన కత్తి బయటకు తీసి శేషగిరిరావుపై దాడి చేశాడు. ఆ పరిణామంతో ఖంగుతిన్న శేషగిరిరావు బిగ్గరగా కేకలు వేశారు. దుండగుడిని ప్రతిఘటించే క్రమంలో శేషగిరిరావు చేయికి గాయం అయ్యింది. శేషగిరిరావు కేకలు విని కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్లు అక్కడకు వచ్చేలోపు  హత్యాయత్నంకు పాల్పడిన దుండగుడు బైక్ పై సిద్దంగా ఉన్న తమ మనుషులతో కలిసి పరారైయ్యాడు.

గాయపడిన శేషగిరిరావును కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు శేషగిరిరావు ఇంటి ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలో పుటేజీని పరిశీలించారు. ఈ హత్య యత్నంకు పాల్పడింది ఎవరు..? వ్యక్తిగత కక్షలా..? రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనేది పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది. హత్యయత్నం ఘటనలో చిన్న గాయాలతో శేషగిరిరావు బయటపడటంతో కుటుంబ సభ్యులు ఊరట చెందుతున్నారు. పలువురు నేతలు, సన్నిహితులు శేషగిరిరావును పరామర్శించి ఘటన గురించి అడిగి తెలుసుకుంటున్నారు. పరామర్శించిన వారిలో టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప తదితరులు ఉన్నారు. దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

Exit mobile version