Home వార్తలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బండి సంజయ్ అనుచరుడికి నోటీసులు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బండి సంజయ్ అనుచరుడికి నోటీసులు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. ఇప్పటికే ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నంద కుమార్. సింహాయాజీలను విచారించిన సిట్ అధికారులు ఈ కేసులో అనుమానితులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకునేందుకు ఒక బృందం కేరళ రాష్ట్రంలో గాలింపు చర్యలు చేపడుతోంది. అనుమానితుల్లో కొందరిని విచారణకు హజరుకావాలని సిట్ నోటీసులు జారీ చేస్తొంది. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడైన బూసారపు శ్రీనివాస్ కు సిట్ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21వ తేదీ 10.30 గంటలకు విచారణకు హజరుకావాలని 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, సింహయాజీలకు బూసారపు శ్రీనివాస్ విమాన టికెట్లు బుక్ చేశారన్న ఆరోపణలు రావడంతో అధికారులు ఆయనను విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఇదే కేసులో కేరళకు చెందిన ఎన్డీఏ నాయకుడు తుషార్ కు కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయనను 21వ తేదీ విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడైన రామచంద్రభారతి, ఫిర్యాదిదారుడైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలతో తుషార్ ఫోన్ లో మాట్లాడినట్లుగా అధికారులు గుర్తించారు.

Exit mobile version