Home వార్తలు Prakasam News: నమ్మకంగా చిట్టీల వ్యాపారం చేస్తూ..!ఏకంగా రూ.5కోట్లకుపైగా ఖాతాదారులకు టోకరా..?

Prakasam News: నమ్మకంగా చిట్టీల వ్యాపారం చేస్తూ..!ఏకంగా రూ.5కోట్లకుపైగా ఖాతాదారులకు టోకరా..?

Prakasam News: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అనధికార చిట్టీల వ్యాపారం జోరుగా సాగుతుంటుంది. కొంత మంది చిటీల వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చి పెద్ద ఎత్తున ఖాతాదారులకు మోసం చేస్తుంటారు. ప్రకాశం జిల్లాలో ఓ కిలాడీ చేసిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చిటీల పేరుతో ఓ మహిళ రూ.5 కోట్ల 60లక్షల మేర ఖాతాదారులకు చెల్లించకుండా నానా తిప్పలు పెడుతుండటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

వివరాల్లోకి వెళితే..చిన గంజాం మండలం సోపిరాలకు చెందిన ఓ మహిళ 25 సంవత్సరాలుగా గ్రామంలో చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నది. ఆమెపై నమ్మకంతో కొందరు వడ్డీకి డబ్బులు ఇచ్చారు. గత ఏడాది వరకూ డబ్బులు ఇచ్చిన వారికి వడ్డీ సక్రమంగా కడుతూ వచ్చిన ఆమె గత ఏడాది నుండి వడ్డీలు చెల్లించలేక వేరే వాళ్ల చిట్టీలను తానే పాడుకుని వారికి నోట్లు రాసి ఇచ్చింది. కొంత మందికి ఎలాంటి తేదీ, ఇతర వివరాలు నోటు మీద రాయకుండానే ఖాళీ ప్రామిసరీ నోటుపై కేవలం సంతకాలు చేసి ఇచ్చింది. ఒక్కొక్కరికి పది లక్షలకుపైగా డబ్బులు ఇవ్వాల్సి రావడంతో వారు ఆమె ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. బాధితులు డబ్బుల కోసం ఆమెను నిలదీస్తే కుమారుడు, కుమార్తె, బంధువులు ఇవ్వాలని వారు ఇవ్వగానే అందరికీ వాయిదాల పద్దతిలో బాకీలు తీరుస్తానంటూ చెప్పుకుంటూ వచ్చింది.

అయితే ఇటీవల తనకు సంబంధించిన ఇల్లు, ఇతర ఆస్తులు బంధువుల పేరుతో రిజిస్ట్రషన్ చేయించడంతో బాధితులకు అనుమానం వచ్చింది. దీంతో బాధితులు చిన గంజాం పోలీసులను ఆశ్రయించారు. సుమారు 40 మంది బాధితులు కుటుంబ సభ్యులతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకున్నారు. బాధితుల నుండి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఆ మహిళను ప్రశ్నించిన తరువాత కేసు నమోదు చేస్తామనీ, బాధితులందరికీ న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు.

Exit mobile version