Home వార్తలు బలవంతపు గడపగడపకు..! ఎమ్మెల్యేలకు అవమానాలు అవసరమా..!?

బలవంతపు గడపగడపకు..! ఎమ్మెల్యేలకు అవమానాలు అవసరమా..!?

వైసీపీ గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మూడున్నర సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించాలన్నది గడప గడపకు మన ప్రభుత్వ ఉద్దేశం. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్దిదారుని వద్దకు వెళ్లి ఆరు లక్షల విలువైన ఇళ్ల స్థలం, ఫింఛన్, రైతు భరోసా, అమ్మ ఒడి ఇలా 8 నుండి పది లక్షల వరకూ లబ్ది ఇచ్చామని వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలు వివరిస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న సంక్షేమాన్ని వివరించి మళ్లీ వైసీపీకే ఓటు వేసే విధంగా మోటివేషన్ చేస్తున్నారు. అయితే గడప గపడకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చాలా చోట్ల ప్రజల నుండి నిరసనలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రి అంబటి రాంబాబు, స్పీకర్ తమ్మినేని సీతారామ్, వెల్లంపల్లి శ్రీనివాసరావు లాంటి వాళ్లతో సహా వందకుపైగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలకు ప్రజల నుండి నిరసన వ్యక్తం అయినట్లు వార్తలు వినబడుతున్నాయి. మంత్రులను సైతం అడ్డుకున్న సందర్భాలు పత్రికల్లోనూ, టీవీల్లోనూ వచ్చాయి.

తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లా సంతనూతలపాడు రిజర్వుడ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా టీజే
ఆర్ సుధాకర్ బాబు ఉన్నారు. ఆయనను వైసీపీ కార్యకర్తలే అడ్డుకున్నట్లు వార్తలు వచ్చాయి. టీడీపీ వాళ్లు అంటే ప్రతిపక్షం వాళ్లు కాబట్టి అడ్డుకున్నారు అనుకోవచ్చు కానీ వైసీపీ కార్యకర్తలే ఎమ్మెల్యే రావద్దు అంటూ ముళ్లకంచెలను అడ్డం వేశారు. రహదారికి అడ్డంగా ముళ్లకంపను వేసి ఎమ్మెల్యే పర్యటనను అడ్డుకున్నారు. ఇటువంటి చేదు అనుభవాలు గతంలో ఏ ఎమ్మెల్యేలకు ఎదురై ఉండవు. ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే..? చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకు పొందన లేకపోవడమే.

మేము అంత చేస్తున్నాము, ఇంత చేస్తున్నాము అంటూ ప్రచారం అయితే చేసుకుంటున్నారు కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మాకు ఇచ్చినట్లే ఇచ్చి ధరలు పెంచి తీసుకుంటున్నారు అన్న భావన ప్రజల్లో ఉంది. రకరకాల వ్యవహారాలు జరుగుతున్నాయి. మోసం చేస్తున్నారు అన్న భావనతోనే అడ్డుకుంటున్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, గ్రామంలో రోడ్లు వేయలేదు, మా సమస్యలు పరిష్కరించలేదు. మీరు మా ఇళ్లకు రావద్దు అంటూ సొంత పార్టీకి చెందిన నేతలే ఆ పార్టీ ఎమ్మెల్యేలను అడ్డుకున్న సందర్భాలు కనబడుతున్నాయి. నాగులుప్పలపాడు మండలంలోని ఎస్సీ కాలనీలో అధికార పార్టీ ఎమ్మెల్యేని అడ్డుకున్న విషయం మీడియాలోనూ వచ్చింది. ఇది వైసీపీకి ఎదురవుతున్న ఒక పాఠం. ఈ ఘటనలపై ప్రభుత్వం, పార్టీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.       

Exit mobile version