Home వార్తలు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి నారాయణను విచారించేందుకు హైకోర్టు ఏపీ సీఐడీకి అనుమతి ఇచ్చింది. అమరావతి మాస్టర్ ప్లాన్ ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ సీఐడీ గతంలోనే కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఏపీ సీఐడి 160 సీఆర్పీసీ కింద నారాయణకు నోటీసులు ఇచ్చింది. అయితే సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులను నారాయణ హైకోర్టులో సవాల్ చేశారు.

ఈ పిటిషన్ పై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో నారాయణను సీఐడీ విచారించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. నారాయణ ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్నారని ఆయన తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ న్యాయస్థానం దృష్టికి తీసుకురాగా, హైదరాబాద్ కూకట్ పల్లిలోని నారాయణ నివాసంలో సీఐడీ అధికారులు  ఆయనను ప్రశ్నించాలని తెలిపింది. సీఐడీ విచారణకు సహకరించాలని నారాయణను హైకోర్టు ఆదేశించింది.   

Exit mobile version