Home వార్తలు Gottipati Ravi Kumar: పెట్రో ధరల పెంపుపై టీడీపీ ఆధ్వర్యంలో జరిగే నిరసనను జయప్రదం చేయాలి

Gottipati Ravi Kumar: పెట్రో ధరల పెంపుపై టీడీపీ ఆధ్వర్యంలో జరిగే నిరసనను జయప్రదం చేయాలి

Gottipati Ravi Kumar: చమురు ధరల పెంపునకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో రేపు నిర్వహిస్తున్న కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం చమురు ధరలు ఇష్టానుసారంగా పెంచేసి ప్రజలను ఆదాయ వనరులుగా మార్చుకుందని విమర్శించారు. పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలనీ, వ్యవసాయ రంగానికి 50శాతం సబ్సిడీపై డీజిల్ అందించాలని డిమాండ్ చేశారు.  ప్రజలకు సంక్షేమం పేరుతో ఇచ్చేదాని కంటే ప్రభుత్వం అంతకు మించి దోచుకుంటుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వేసే ట్యాక్స్ లకు అదనంగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై భారం వేస్తోందన్నారు.   

లీటర్ పెట్రోల్ ధర ఏపీలో రూ.108.16 పైసలు ఉంటే, డీజిల్ ధర రూ.99.74 పైసలుగా ఉందన్నారు. రాష్ట్రం ఈ ఒక్క అంశంలోనే దేశంలో అగ్రస్థానంలో ఉందన్నారు. పెట్రోల్, డీజిల్ అనేవి వ్యవసాయ రంగంపై, ఇతరత్రా రంగాలపై ఎంత ప్రభావం చూపుతాయో ముఖ్యమంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. వ్యవసాయ రంగంపై కూడా దాని ప్రభావం అధికంగా ఉందన్నారు. గతంలో ట్రాక్టర్ తో దుక్కి దున్నడానికి ఎకరాకి వెయ్యి నుండి 12 వందలు తీసుకునే వారనీ, కానీ ఇప్పుడు డీజిల్ ధరలు పెరిగాయంటూ రూ.2వేల వరకు వసూలు చేస్తున్నారని దీని వల్ల రైతులపై అదనపు భారం పడుతోందన్నారు. డీజిల్ ధరల పెంపు వల్ల నిత్యావసరాల ధరలు, కూరగాయల ధరలు కూడా పెరగడంతో పేద, మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. చమురు ధరల పెరుగుదల ప్రభావం వల్ల అప్రకటిత క్రాప్  హాలిడే దిశగా రైతాంగం నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉందన్నారు.  వైసీపీ ప్రభుత్వం పెంచిన చమురు ధరలకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో రేపు నిర్వహించే ధర్నాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

Exit mobile version