Home వార్తలు ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్

ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్

ప్రభుత్వంలోని పలువురు ఉన్నతాధికారుల తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు న్యాయ సమీక్షలో వీగిపోతున్నాయి. కీలక నిర్ణయాల సమయంలో న్యాయ సలహా తీసుకోకపోవడమే ఇందుకు కారణంగా చెప్పుకోవాల్సి వస్తుంది. తరచు ఏపి హైకోర్టు..పలు ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతూ ఆదేశాలు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీనియర్ రెసిడెన్సి పోస్టుల నియామకానికి జారీ చేసిన నోటిఫికేషన్ ను ఏపి హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. సీనియర్ రెసిడెన్సి పోస్టుల భర్తీ నియామకానికి ప్రైవేటు కళాశాల విద్యర్ధులను అనుమతించకపోవడంపై హైకోర్టును కర్నూలుకు చెందిన డాక్టర్ ఝాన్సీ రాణి తదితరులు ఆశ్రయించారు.

ఈ పిటిషన్లను హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారించారు. పిటిషన్ల తరపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వైద్యులు మాత్రమే ఈ పోస్టు నియామకానికి అనుమతించడం డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబందనలకు వ్యతిరేకమని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఏ కళాశాలలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసినప్పటికీ సీనియర్ రెసిడెన్సి పోస్టుకు అర్హులేనని న్యాయవాది జడ శ్రవణ్ వాదనలు వినిపించారు. పిటిషనర్ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. సదరు  నోటిఫికేషన్ ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.  

Exit mobile version