Home వార్తలు AP CM YS Jagan: ఎయిడెడ్ విద్యాసంస్థలకు ఊరట

AP CM YS Jagan: ఎయిడెడ్ విద్యాసంస్థలకు ఊరట

AP CM YS Jagan:  ఎయిడెడ్ విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదని సీఎం వైఎస్ జగన్  స్పష్టం చేశారు. సోమవారం విద్యా శాఖపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను  ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తిగా వారి ఇష్టమని చెప్పారు. శిధిలావస్థలో, మౌలిక సదుపాయలు లేక విద్యార్ధులు, సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి వారికి ఒక అవకాశం ప్రభుత్వ పరంగా కల్పించడానికి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. విద్యావ్యవస్థలో సమూల మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వానికి అప్పగిస్తే ఆయా సంస్థలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పారు. లేదు తామే నడుపుకుంటామంటే బేషుగ్గా నడుపుకోవచ్చని అన్నారు. దీనికి ఎలాంటి అభ్యంతరం లేదని  సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఎయిడెడ్ విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదని అందరికీ స్పష్టం చేయాలని సీఎం జగన్ తెలిపారు.

విద్యావ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలల స్వాధీనానికి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎయిడెడ్ విద్యాసంస్థలకు కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఉండటంతో ఆయా సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వానికి అప్పగించేందుకు ముందుకు రావడం లేదు. పలు విద్యాసంస్థల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రే స్వయంగా ఎయిడెడ్ యాజమాన్యాలకు ఊరట నిచ్చేలా ప్రకటన చేశారు.

Exit mobile version