Home వార్తలు తనిఖీల పేరుతో ఇబ్బందులు కలిగించవద్దు : రామ్ మోహన్ మిశ్రా

తనిఖీల పేరుతో ఇబ్బందులు కలిగించవద్దు : రామ్ మోహన్ మిశ్రా

ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల స్పెషల్ జనరల్ అబ్జర్వరు రామ్ మోహన్ మిశ్రా తెలిపారు. అదే సమయంలో తనిఖీల పేరుతో సామాన్య జనానికి ఇబ్బంది కలిగించరాదని స్పష్టం చేశారు. సోమవారం జిల్లాకు వచ్చిన ఆయన ప్రకాశం భవనములో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగేలా జిల్లా యంత్రాంగం చేపట్టిన పై చర్యలపై సమీక్షించారు. ఇప్పటికే జిల్లాకు జనరల్ అబ్జర్వర్లుగా వచ్చిన అరవింద్ కుమార్ చౌరాసియా, మయూర్ కె మెహతా, ఖజాన్ సింగ్, పోలీసు అబ్జర్వరు హసీబ్ ఉర్ రెహమాన్ లతో కలిసి జిల్లాలోని పరిస్థితిపై ఆరా తీశారు.
జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ అంశాలను ఆయనకు వివరించారు. పోలింగ్ నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని ఇప్పటికే గుర్తించి వారికి తగిన శిక్షణను కూడా ఇచ్చామని కలెక్టర్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓ.పి.ఓ.లకు కూడా శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులను కల్పించడంతోపాటు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి భద్రతాపరమైన చర్యలను తీసుకుంటున్నట్లు వివరించారు. వివిధ అంశాలకు సంబంధించి 16 ప్రత్యేక నోడల్ ఆఫీసర్లను జిల్లా స్థాయిలోనూ, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలోనూ నియమించామని చెప్పారు. వీరి ద్వారా వివిధ అంశాలను నిరంతరం పరిశీలిస్తున్నామని, ఎస్. ఎస్.టి, ఎఫ్.ఎస్.టి., ఇతర బృందాల ద్వారా జిల్లాలోని పరిస్థితిని ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఓటర్లందరూ తమ హక్కును వినియోగించుకునేలా చూస్తున్నామని, ఈ దిశగా ‘ సంకల్పం ‘ పేరుతో ప్రత్యేక స్టిక్కర్లను రూపొందించి ప్రతి ఇంటికీ అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఓటు హక్కు వినియోగంపై చైతన్యం కలిగించేలా వివిధ రూపాలలో ‘ స్వీప్ ‘కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఎస్పీ మాట్లాడుతూ…. అర్హులందరూ నిర్భయంగా ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఎన్నికల నిర్వహణకు పోలీసు సిబ్బందితో పాటు మాజీ సైనికులు, ఎన్.సీ.సీ. సేవలను కూడా వినియోగించుకుంటున్నామని పేర్కొన్నారు. లైసెన్సుడ్ ఆయుధాలను డిపాజిట్ చేయించామని, నాన్ బెయిలబుల్ కేసులను ఎగ్జిక్యూట్ చేశామని, అనుమానతులపై బైండోవర్ కేసులు పెట్టామని చెప్పారు. సెల్ ఫోన్ టవర్ల సామర్థ్యాన్ని పరీక్షించి కమ్యూనికేషన్ వ్యవస్థకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక మెసెంజర్ వ్యవస్థను ఏర్పాటు చేశామని ఎస్పీ వివరించారు. మద్యం దుకాణాల నుంచి పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై స్పెషల్ జనరల్ అబ్జర్వర్ శ్రీరాం మోహన్ మిశ్రా స్పందించారు…. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్న తీరును ప్రశంసించారు. అభ్యర్థులు చేస్తున్న ఖర్చుపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. సువిధ యాప్ ద్వారా ఫిర్యాదులను సమర్థంగా సత్వరమే పరిష్కరిస్తున్న తీరుపైనా ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ శౌర్య మన్ పటేల్, డిఆర్ఓ శ్రీమతి.ఆర్.శ్రీలత, నోడల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Exit mobile version