Home వార్తలు YS Jagan: ఏపిలో జగనన్న టౌన్ షిప్‌లను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

YS Jagan: ఏపిలో జగనన్న టౌన్ షిప్‌లను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం జగనన్న స్మార్ట్ టౌన్ షిప్‌లకు సంబంధించి లే అవుట్లు, వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో 30లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఇప్పటికే పేదల ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. మధ్యతరగతి వర్గాల సొంతింటి కల కూడా ఇక నెరవేరనుందని జగన్ అన్నారు. తొలి దశలో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు, అనంతపురం జిల్లా ధర్మవరం, ప్రకాశం జిల్లా కందుకూరు, కడప జిల్లా రాయచోటి, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వద్ద లే అవుట్లు సిద్ధం చేయడం జరిగిందన్నారు.

అన్ని అనుమతులు, వసతులతో డిమాండ్ కు అనుగుణంగా మద్యతరగతి వర్గాలకు ఈ టౌన్ షిప్ లలో 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లు ఎంచుకునే అకాశం ఉందని అన్నారు.   వార్షిక ఆదాయం రూ.18లక్షల కంటే తక్కువ ఉన్న వారికి మాత్రమే ఇళ్ల స్థలాల కేటాయింపు జరుగుతుందనీ, వెబ్ సైట్ ద్వారా నేటి నుండి ధరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుందని చెప్పారు. అత్యంత పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని సీఎం చెప్పారు. ఫ్లాట్ ధరను నాలుగు వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. లే అవుట్లలో 60 అడుగుల బీటీ రోడ్డు, 40 అడుగుల సీసీ రోడ్డు, మౌళిక సదుపాయాలు ఉంటాయన్నారు. సెకండ్ ఫేజ్ లో ప్రతి నియోజకవర్గంలో జగనన్న టౌన్ షిపిలు ఏర్పాటు సిద్దం కానున్నాయని సీఎం జగన్మోహనరెడ్డి తెలిపారు.

Exit mobile version