Home వార్తలు Toll Issue: టోల్ గేటు వద్ద ఐఏఎస్ కు తప్పని తిప్పలు..!!

Toll Issue: టోల్ గేటు వద్ద ఐఏఎస్ కు తప్పని తిప్పలు..!!


Toll Issue: ఓ టోల్ గేటు వద్ద జిల్లా కలెక్టర్ గా పని చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి వాహనాన్ని సిబ్బంది నిలుపుదల చేయడం వివాదాస్పదం అయ్యింది. సాధారణంగా జాతీయ రహదారులపై టోల్ గేట్ ల వద్ద టోల్ ఫీజు చెల్లింపు విషయంలో అధికార పార్టీ నాయకులు గొడవ చేయడం చూస్తుంటాం. నేడు ఓ ఐఏఎస్ వాహనాన్ని నిలుపుదల చేయడంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది టోల్ గేటు సిబ్బందితో వాగ్వివాదానికి దిగడం ప్రకాశం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ వాహనాలకు టోల్ ఫీజు మినహాయింపు ఉంటుంది. అయితే కొందరు ప్రైవేటు వాహనాల్లో వెళుతున్న సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

విషయంలోకి వెళితే.. ఇటీవల కాలం వరకూ ప్రకాశం జిల్లా కలెక్టర్ గా పని చేసి ప్రస్తుతం ఏపి కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న పోలా బాస్కర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని సైతం టోల్ గేటు వద్ద సిబ్బంది నిలువరించడం వివాదానికి కారణం అయ్యింది. ప్రకాశం జిల్లాలో కర్నూరు – గుంటూరు రహదారిపై త్రిపురాంతకం మండలం మేడపి దగ్గర ఉన్న టోల్ ప్లాజా వద్ద పోలా భాస్కర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని టోల్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఇక్కడ వివాదం చెలరేగింది. వాహనానికి టోల్ ఫీజు కట్టే విషయంపై పోలా బాస్కర్ తో టోల్ గేట్ సిబ్బంది వాగ్వివాదానికి దిగారు. తాను ఐఏఎస్ అధికారిని, ప్రస్తుతం కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా ఉన్నానని పోలా బాస్కర్ టోల్ సిబ్బందికి తెలిపినా టోల్ గేట్ సిబ్బంది ఐడీ కార్డు చూపించాలంటూ నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. దీంతో పోలా బాస్కర్ వ్యక్తిగత సిబ్బంది టోల్ గేటు సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. టోల్ గేటు సిబ్బంది పోలా బాస్కర్ వాహనానికి అడ్డంగా నిలబడి కదలకుండా అడ్డుకున్నారు. ఈ విషయం తెలియడంతో త్రిపురాంతకం తహసీల్దార్ కిరణ్, పోలీసులు అక్కడకు చేరుకుని టోల్ గేట్ సిబ్బందితో మాట్లాడి పోలా బాస్కర్ ను అక్కడి నుండి పంపించేశారు.

ఈ సందర్భంలో టోల్ గేటు సిబ్బందిపై తహశీల్దార్ కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వాహనాలను, ఉన్నతాధికారులు ప్రయాణించే వాహనాలను అడ్డుకుని దురుసుగా ప్రవర్తించడం ఏమిటని సిబ్బందిని నిలదీశారు. టోల్ గేటు వద్ద ప్రభుత్వ వాహనాలను అడ్డుకున్నా, వాహనదారులతో దుసుసుగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ గా పని చేసిన ఐఏఎస్ అధికారి వాహనాన్నే టోల్ గేటు వద్ద సిబ్బంది నిలుపుదల చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఓ ఉన్నతాధికారి పట్లే ఈ విధంగా సిబ్బంది ప్రవర్తిస్తుంటే సామాన్య వాహనదారులపై ఏ విధంగా వీరి ప్రవర్తన ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

Exit mobile version