Home వార్తలు విశాఖ ఉక్కుపై మోదీ ప్రకటన చేయాలి : వి.శ్రీనివాసరావు

విశాఖ ఉక్కుపై మోదీ ప్రకటన చేయాలి : వి.శ్రీనివాసరావు

రాష్ట్రానికి కీలకమైన విశాఖ ఉక్కుపై రేపు అనకాపల్లి సభలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండు చేశారు.పోలవరానికి ఇచ్చిన 15 వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లాయని…అక్కడ నష్టపోయిన గిరిజనులకు ఏమీ ఇవ్వలేదని ధ్వజమెత్తారు. పునరావాసం కోసం రూ.33 వేల కోట్లు అవసరం అయితే రూ.400 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.ఆదివారం విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఎన్డీయే, వైసిపిలు నేరస్తులేనని విమర్శించారు. చట్టాన్ని అమలు చేయాలని బిజెపి హుకుం జారీచేయగానే…. వైసిపి ఆగమేఘాల మీధ ఆమోదించారని ధ్వజమెత్తారు. చట్టం చేయకముందే బిజెపిని నిలదీయకుండా… బిజెపి వివరణ ఇవ్వాలని సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడటం సరికాదన్నారు.

కేంద్రంలో చట్టం తీసుకొచ్చిన బిజెపితో కలిసి ఎన్నికల్లోకి వెళుతున్న చంద్రబాబు దీన్ని ఎలా రద్దు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. కార్పొరేట్‌ కంపెనీలకు భూములు కట్టబెట్టేందుకు తీసుకొచ్చిన ఈ చట్టాన్ని అమలు చేయాలని కేంద్రం నీతిఅయోగ్‌ ద్వారా అన్ని రాష్ట్రాలకు హుకుం జారీచేసిందని తెలిపారు. చట్టం ప్రకారం ప్రతి యజమాని భూమి తనదే అని ప్రాథమిక కమటీకి దరఖాస్తు చేసుకోవాలని… రెండేళ్ల తరువాత శాశ్వత పట్టా ఇస్తారని వివరించారు.ఈ లోగా వివాదం వస్తే చిన్న యజమానులు భూములు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం వలన రైతుల భూములకు భద్రతలేని పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. అదానీ, అంబానీ లాంటి వ్యక్తులకు వేల ఎకరాలు కట్టబెట్టేందుకు తీసుకొచ్చిన ఈ చట్టం అమలు చేస్తే రైతుల భూములన్నీ ఒకరిద్దరి చేతుల్లోకి వెళ్లిపోతాయని అన్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ మ్యుటేషన్‌ తీసుకొచ్చారని, ఇది కూడా అమలయితే ఎవరికి భూములు ఎప్పుడు ఎవరి చేతుల్లోకి వెళతాయో తెలియని దుస్థితి నెలకొంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతర భూస్వాములు తప్పుడు రికార్డులు సృష్టించి అనుభవిస్తున్నారని, ఆ భూములకు ఇప్పుడు చట్టబద్ధత వస్తుందని హెచ్చరించారు. ఇండియా వేదికలో పార్టీలను గెలిపించాలని కోరారు.

Exit mobile version