Home వార్తలు New Zealand MP: ప్రకాశం జిల్లా యువతికి న్యూజిలాండ్ లో అరుదైన గౌరవం..

New Zealand MP: ప్రకాశం జిల్లా యువతికి న్యూజిలాండ్ లో అరుదైన గౌరవం..


New Zealand MP: భారత సంతతికి చెందిన వారు ప్రపంచంలోని అనేక దేశాలలో తమ ప్రతిభా పాటవాలతో ఉన్నత పదవులు అలంకరిస్తున్న సంగతి తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఎన్నికై తమిళనాడు రాష్ట్రానికి గర్వకారణంగా నిలవగా, ప్రకాశం జిల్లాకు చెందిన యువతి న్యూజిలాండ్ లో యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికై అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన గడ్డం మేఘన (18) న్యూజిలాండ్ లో సేవా కార్యక్రమాలు, యువత విభాగానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ సభ్యురాలిగా వాల్కటో ప్రాంతం నుండి ఎంపికైయ్యారు. మేఘన తండ్రి
గడ్డం రవికుమార్ ఉద్యోగ రీత్యా 2001లో భార్య ఉషతో కలిసి న్యూజిలాండ్ వెళ్లి స్థిరపడ్డారు. మేఘన అక్కడే పుట్టి పెరిగారు. కేంబ్రిడ్జిలోని సెయింట్ పీటర్స్ ఉన్నత పాఠశాలలో స్కూలింగ్ పూర్తి చేశారు. చిన్నతనం నుండే సేవా కార్యక్రమాల పట్ల మక్కువ చూపించే మేఘన నియోజకవర్గాల వారిగా అందించే
అవార్డును దక్కించుకున్నారు. ఆ స్కూల్ చరిత్రలో తొలి సారిగా భారత సంతతికి చెందిన మేఘన ఉత్తమ విద్యార్ధిగా ఎంపికై రికార్డు సృష్టించారు.

మేఘన తన సేవా కార్యక్రమాల్లో భాగంగా సహచర స్నేహితుల తో కలిసి విరాళాలను సేకరించి అనాధ శరణాలయాలను అందజేస్తూ వచ్చారు. న్యూజిలాండ్ కు వలస వచ్చిన
పలు దేశాల శరణార్ధులకు కనీస వసతులు, విద్య, ఆశ్రయిం వంటి సౌకర్యాలు కల్పించడంలో మేఘన క్రీయాశీల పాత్ర పోషించారు. ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించిన ప్రభుత్వం వాల్కటో పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపిక చేసింది. గత ఏడాది డిసెంబర్ 16న ఈ ఎన్నిక జరగ్గా ఈ ఏడాది ఫిబ్రవరి
నెలలో పార్లమెంట్ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామానికి విచ్చేసిన మేఘన కుటుంబ సభ్యులు ఈ విషయాలను
గ్రామస్తులతో పంచుకున్నారు. న్యూజిలాండ్ లో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంట్ లో తన వాణి వినిపిస్తానని పేర్కొన్నారు మేఘన.

Exit mobile version