Home వార్తలు ప్రదాని మోడీతో జనసేన అధినేత పవన్ చర్చించిన విషయాలు ఇవే

ప్రదాని మోడీతో జనసేన అధినేత పవన్ చర్చించిన విషయాలు ఇవే

విశాఖ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఐఎన్ఎస్ చోళ గెస్ట్ హౌస్ నందు ప్రధాని మోడీతో పవన్ సమావేశమైయ్యారు. దాదాపు 35 నిమిషాల సేపు రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపై పవన్ చర్చించారు. అనంతరం నోవాటెల్ హోటర్ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల క్రితం పీఎంఓ కార్యాలయం నుండి ఫోన్ చేసి విశాఖలో పీఎం మోడీని కలిసేందుకు ఆపాయింట్మెంట్ ఖరారు చేశారని పవన్ చెప్పారు. దాదాపు 8 సంవత్సరాల తర్వాత ప్రధాని మోడీతో భేటీ కావడం జరిగిందన్నారు.

ఈ భేటీ ఏపికి భవిష్యత్తులో మంచి రోజులు వచ్చే దిశగా ఫలప్రదం అయ్యిందని భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇది ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన సమావేశం అని చెప్పారు. ప్రధాని మోడీ అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారన్నారు. ఏపి ప్రజలు బాగుండాలని, తెలుగు ప్రజలు అందరూ ఐక్యంగా ఉండాలని మోడీ అభిలషించారని పవన్ వివరించారు. తనకు అవగాహన ఉన్న మేరకు ప్రధాని అడిగిన విషయాలు తెలియజేశానని తెలిపారు. కాగా ఇటీవల విశాఖలో జరిగిన పరిణామాల గురించి ప్రధాని మోడీకి వివరించారా అని అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు పవన్ సమాధానం దాటవేశారు. ఇవన్నీ తర్వాత తెలియజేస్తానని పవన్ చెప్పి మీడియా సమావేశాన్ని ముగించారు. ఈ కీలక భేటీలో పవన్ తో పాటు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

కాగా తమిళనాడులో భారీ వర్షాల కారణంగా పీఎం మోడీ విశాఖకు అరగంట ఆలస్యంగా చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో ప్రధాని మోడీకి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్, బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. తర్వాత ఐఎన్ఎస్ చోళ గెస్ట్ హోస్ కు చేరుకున్న మోడీ ..రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం 10.10 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని మోడీ. ఈ బహిరంగ సభలో ప్రధాని మోడీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్, కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ లు ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం హైదరాబాద్ పర్యటనకు వెళ్తారు.

Exit mobile version