Home వార్తలు AP CRDA: సీఆర్‌డీఏకి హ్యాపీనెస్ట్ కస్టమర్స్ లీగల్ నోటీసులు

AP CRDA: సీఆర్‌డీఏకి హ్యాపీనెస్ట్ కస్టమర్స్ లీగల్ నోటీసులు

AP CRDA: హ్యాపీనెస్ట్ నిర్మాణంలో జాప్యంపై సీఆర్డీఏకు 28 మంది కస్టమర్ లు లీగల్ నోటీసులు పంపించారు. 2021 నాటికి ప్లాట్లు అందజేయాలన్న నిబంధన ఉన్నా గడువు తీరినా ప్లాట్లు అప్పగించకపోవడంతో తాము చెల్లించిన పది శాతం సొమ్మును 14 శాతం వడ్డీతో సహా చెల్లించాలని నోటీసుల్లో కోరారు. అలాగే రూ.20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు. లేకుంటే సీఆర్డీఏపై రేరా చట్టం కింద కేసు వేస్తామని కొనుగోలు దారులు పేర్కొన్నారు. ఈ మేరకు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు ద్వారా సీఆర్డీఏ అధికారులకు నోటీసులు పంపారు.

అమరావతి రాజధాని పరిధిలో 2018లో అప్పటి ప్రభుత్వం సీఆర్డీఏ ద్వారా హ్యాపీనెస్ట్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నిర్మించే 12 టవర్లలో 1200 ప్లాట్ లు నిర్మిస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్రకటనతో హ్యాపీనెస్ట్ ప్లాట్లు అన్నీ గంటలో అమ్ముడయ్యాయి. సీఆర్డీఏ ఒప్పందం మేరకు తొలి వాయిదాగా కొనుగోలుదారులు పది శాతం సొమ్ము చెల్లించారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి షాపూర్‌జీ పల్లోంజీ టెండర్లకు ముందుకు వచ్చింది. డిసెంబర్ 31, 2021 నాటికి ప్లాట్లు అందజేయాలని ఒప్పందం జరిగింది. అయితే ఆ తరువాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ సర్కార్ మూడు రాజధానుల ప్రక్రియ చేపట్టడంతో అమరావతి ప్రాంతంలో అన్ని నిర్మాణాలతో పాటు హ్యాపీనెస్ట్ నిర్మాణం నిలిచిపోయింది. గత ఏడాది రీ టెండర్ల పేరుతో హడావుడి చేసినా ఎవరూ ముందుకు రాలేదు.

Exit mobile version