Home వార్తలు రుషి కొండ తవ్వకాలపై సీపీఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు .. మంత్రి అమరనాథ్ కౌంటర్

రుషి కొండ తవ్వకాలపై సీపీఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు .. మంత్రి అమరనాథ్ కౌంటర్

హైకోర్టు అనుమతితో సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ శుక్రవారం విశాఖ రుషి కొండ ప్రాంతాన్ని సందర్శించారు. ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పకృతి సిద్ధంగా వచ్చిన కొండను నాశనం చేశారని విమర్శించారు. పకృతిని నాశనం చేసిన పాపం ఊరికే పోదని అన్నారు. ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసినా రుషికొండ సహజసిద్ద స్వరూపం రాదని తెలిపారు. టెంకాయకు చుట్టూ పీచు తీసి, పైన పిలక మిగిల్చిన మాదిరిగా రుషి కొండ కనిపిస్తొందని నారాయణ వ్యాఖ్యానించారు. దీనిని పకృతిపై అత్యాచారంగా భావిస్తున్నానన్నారు.

బయట అనుకుంటున్నట్లు సీఎం కార్యాలయం లాంటి ఏర్పాట్లు కనిపించలేదని అన్నారు. విలాసవంతమైన నిర్మాణాలు మాత్రం జరుగుతున్నాయని తెలిపారు. ఓ రిసార్ట్ కోసం రుషి కొండ రూపు రేఖలు మార్చివేయడం ఎంత అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలంటే విశాఖ, అనకాపల్లిలో ఇంకెక్కడైనా రిసార్టులు కట్టుకోవచ్చు కదా అని అన్నారు. అత్యాచారం ఎంత ఘోరమో అంతకు మించి ఈ ప్రభుత్వం పర్యావరణంపై ఘతకానికి పాల్పడిందని నారాయణ ఘాటుగా విమర్శించారు. రుషి కొండ సందర్శనకు తాను మూడు నెలల క్రితమే హైకోర్టును ఆశ్రయించాననీ, అనుమతి లభించలేదనీ, మరల ఇప్పుడు కోర్టుకు వెళితే అనుమతి వచ్చిందని నారాయణ తెలిపారు.

కాగా నారాయణ వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమరనాథ్ స్పందించారు. నారాయణ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. విశాఖలో ఎలాంటి నిర్మాణాలు జరిగినా వాటిని అడ్డుకోవడమే విపక్షాలు పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. గతంలో కొండల్లో అనేక పర్యాటక ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయనీ, రుషికొండలోనూ అలాంటి ప్రాజెక్టే చేపడుతుంటే విపక్షాలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయో అర్ధం కాావడం లేదని అన్నారు. విపక్షాలు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని మంత్రి అమరనాథ్ హితవు పలికారు. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాగా ఉన్న సీపీఐ చాలా సంవత్సరాల క్రితమే చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియా గా మారిపోయిందనీ, ఇప్పుడు ఆ పార్టీ నాయకులు రుషికొండ వద్దకు వెళ్లి అంత కంటే గొప్పగా మాట్లాడతారని తాము అనుకోలేదని మంత్రి అన్నారు.

Exit mobile version