Home వార్తలు ఫించన్ల పంపిణీలో ప్రభుత్వ యంత్రాంగం విఫలం : సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ

ఫించన్ల పంపిణీలో ప్రభుత్వ యంత్రాంగం విఫలం : సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ

హైకోర్టు ఆదేశాల ప్రకారం ఫించన్ లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా పింఛన్ల పంపిణీకి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది. వయోవృద్దులకు, దివ్యాంగులకు,ఇంటిదగ్గరే పింఛన్లు అందించాలని ఎన్నికల కమిషన్ తన ఆదేశాల్లో స్పష్టంగా చెప్పింది. కానీ ఈ విషయంలో రాష్ట్ర అధికార యంత్రాంగం విఫలం కావడం విచారకరం. దీనికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పూర్తి బాధ్యత వహించాలి. అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధి బృందం త్వరలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని,భారత ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తామని తెలిపింది. శనివారం “సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ” ఆధ్వర్యంలో అభివృద్ధి తో సంక్షేమం సుపరిపాలన కు సవాళ్లు అనే అంశం పై చర్చ గోస్టీ విజయవాడ లోని బాలోత్సవ భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సంస్థ ప్రధానకార్యదర్శి డా.నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ….రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెలా రెండువేల కోట్ల రూపాయల మేరకు పింఛన్లు అంద చేస్తున్నారు. వారికి పింఛన్లు సకాలంలో అందచేయక పోవడం , ఇంటి దగ్గర ఇవ్వకపోవడం అంటే హైకోర్టు ఉత్తర్వులను , ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఖాతరు చేయకపోవడమే అవుతుంది అని పేర్కొన్నారు. తగిన యంత్రాంగం, మానవ వనరులు ఉన్నప్పటికీ పింఛన్ల పంపిణీలో ప్రజలు ఇబ్బందులు పడ్డారంటే ఈవైఫల్యం ఉద్దేశ్య పూర్వకమైనదని భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ప్రజల మనోభావాలతో ఆడుకునే ఒక అవాంఛనీయ పరిస్థితిని కల్పించడం కూడా అత్యంత దురదృష్టకరమని అన్నారు. వచ్చే నెలలో ఎలాంటి అయోమయానికి తావులేకుండా పింఛన్ల పంపిణీ సజావుగా సాగాలని ఆయన డిమాండ్ చేశారు.రాష్ట్రంలో నిష్పాక్షిక స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికలు, ప్రజలకు జవాబుదారీ తనంగా అందుబాటులో ఉండే సుపరిపాలన , అధికార వికేంద్రీకరణ వంటి లక్ష్యాలకోసం పని చేస్తున్న సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ కు మద్దతు ఇవ్వాలని పౌరసమాజాన్ని కోరారు.ఎన్నికల తరుణంలో రాష్ట్ర ప్రగతికి, సర్వతోముఖాభివృద్ధికి దారి తీసే అంశాలపై చర్చ చేయాలని అన్ని ప్రధాన రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేశారు.

వాలంటీర్ల వ్యవస్థ పై దొందు దొందే

వలంటీర్ల వ్యవస్థను శాశ్వతం చేయాలని కోరుకుంటున్న అధికార పార్టీవిధానం తిరోగమనచర్య కాగా , కొద్దిపాటి మార్పులతో అదే వ్యవస్థను కొనసాగించాలన్న ప్రదానప్రతిపక్షపార్టీ విధానం అవకాశవాదంతో కూడినదని పేర్కొన్నారు. వలంటీర్ల వ్యవస్థ హానికరమైనదే కాకుండా, అది చట్టవిరుద్ధమైనదీ, అనైతికమైనదీ అందువల్లనే తొలినుండీ వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవాలన్న ఏకైక ఉద్దేశ్యంతో తమ సొంత రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం దాని సృష్టికర్తలు వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసారని తెలిపారు. రెండున్నర లక్షల మంది వలంటీర్లు అధికారపార్టీ కార్యకర్తలు లేదా సానుభూతిపరులన్న విషయాన్ని అధికారపార్టీ నేతలు పదే పదే నిస్సిగ్గుగా , మొండిగా ప్రకటిస్తూ రావడం గత నాలుగేళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఈ వలంటీర్ల వ్యవస్థ వల్ల ఏటా దాదాపు రెండువేల కోట్ల రూపాయల భారం అంతిమంగా రాష్ట్ర ప్రజల నెత్తి మీద పడుతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు.దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి వ్యవస్థ లేకపోయినా ఆయా రాష్ట్రాల్లో సంక్షేమపథకాలు ప్రజల ఇంటి ముంగిటికి అందుతున్నాయన్న అంశాన్ని ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఒక కేసు విచారణ సందర్భంగా పేర్కొన్నది అని గుర్తు చేశారు.అధికారాల వికేంద్రీకరణ ఉద్దేశ్యంతో చేసిన 73,74 రాజ్యాంగ సవరణల స్ఫూర్తికి విరుద్ధంగా గ్రామ , వార్డు సచివాలయ సిబ్బందితో పాటు ఈ వలంటీర్లు కూడా నియమితులయ్యారు.


గ్రామ పంచాయతీలలోనూ, పురపాలక సంఘాల్లోనూ ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు జవాబుదారిగా లేరు.అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ఆర్టికల్ 16 కు , సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వలంటీర్ల నియామకం జరిగింది. అసలు అలాంటి నియామకమే చట్టవిరుద్ధమైనది అని తెలిపారు.తమ రాజకీయ యాజమానుల ప్రయోజనాలను నెరవేర్చడానికి వలంటీర్లు ఓటర్లను భయపెట్టడం, బలవంతం చేయడం, ప్రలోభ పెట్టడం లాంటి చర్యల ద్వారా రాష్ట్రంలో వాతావరణాన్ని చెడగొట్టారని మండిపడ్డారు. అయినప్పటికీ పాలకపక్షం వాలంటీర్లు అక్రమచర్యలకు ప్రజామోదం పొందటానికి వీలుగా వారిని భుజానికి ఎత్తుకుని నిస్సిగ్గుగా ప్రచారం సాగిస్తున్నది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.2021 మునిసిపల్ ఎన్నికల సందర్భంగా చాలాచోట్ల వలంటీర్లు పలు అక్రమ చర్యలకులకు పాల్పడ్డారు. తీవ్రమైన ఆంక్షలు విధించడం ద్వారా వలంటీర్ల అవినీతికర చర్యలను అరికట్టడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అప్పట్లో విజయవంతం అయ్యింది. 2021 లో జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల సందర్భంగా స్థానిక వలంటీర్ల కుమ్మక్కుతో దాదాపు 35 వేల దొంగఓట్లు పోలయినాయన్న సంగతిని భారత ఎన్నికల సంఘం కూడా గుర్తించింది. వలంటీర్ల అక్రమాలకు తిరుపతి ఉపఎన్నిక ఒక ఉదాహరణ గా నిలుస్తుంది.ఇటీవల రాష్ట్రంలో ఓటర్ల జాబితాల తయారీలో వలంటీర్లను వినియోగించడం జరిగింది.
వారిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నిష్పాక్షిక స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలన్న ఉద్దేశ్యంతోనే ఎన్నికలకు సంబంధించిన పనులకు వలంటీర్లను దూరంగా ఉంచాలని కోరారు.అయినప్పటికీ అధికారపార్టీ కార్యకలాపాలలో వారు పాలు పంచుకోవడం, అధికారపార్టీ అభ్యర్థుల వెంట తిరుగుతూ ఓట్లు అభ్యర్ధించే కార్యక్రమంలో భాగస్వాములు కావడం వంటి తీవ్రమైన ఉల్లంఘనలకు వలంటీర్లు పాల్పతూ వచ్చారు. అభ్యంతరాలను పట్టించుకోకుండా వలంటీర్లు అధికారపార్టీ కార్యకర్తలుగా పనిచేయడం కొనసాగుతూ వచ్చింది. అందువల్లనే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఒక ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయాల్సి వచ్చింది. దానిపై హైకోర్టు స్పందించి అధికారపార్టీ రాజకీయ కార్యక్రమాల్లో , ఓటర్లను కలుసుకునే కార్యక్రమాల్లోనూ , పింఛను పంపిణీలోనూ వలంటీర్లను దూరంగా ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.అందుకు అనుగుణంగానే ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసింది.ఎన్నికల కమిషన్ ఆదేశాలు సరైనవే అయినప్పటికీ వాటిని నిలిపి వేయాలంటూ స్టే కోసం చేసిన ప్రయత్నాలను హైకోర్టు తిరస్కరించింది.అధికారపార్టీ నేతల ప్రేరణతో తాజాగా రాజీనామాలు చేస్తున్న వలంటీర్లను పోలింగు బూతులలో ఏజెంట్లుగా అనుమతించరాదని కోరారు.

ఉద్దేశపూర్వకంగానే వాలంటీర్ల అంశం

మానవాభివృద్ధి సూచికల్లో ఆంధ్రప్రదేశ్ మనదేశంలోని రాష్ట్రాల జాబితాలో 25 వ స్థానంలో ఉన్నట్లు 2021 నాటి గ్లోబల్ డేటా ల్యాబ్ వెల్లడించింది.ప్రజల ఆకాంక్షలకు తగినట్లుగా స్పందించడంలోనూ , వాటిని నెరవేర్చడంలోను మనం చేయాల్సిన ప్రయాణం ఇంకెంతో ఉంది. ప్రస్తుత ఎన్నికలు సహా అన్ని ఎన్నికల్లోనూ ప్రజలకు నిజంగా అవసరమైన విద్య, వైద్యం, ఉపాధి, శాంతి భద్రతలు, రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి , సంక్షేమం వంటి అంశాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది.కానీ కీలకమైన అంశాలపై చర్చించడానికి బదులు వలంటీర్లు లాంటి అంతగా ప్రాధాన్యత లేని అంశంపై చర్చ కేంద్రీకృతం అయ్యేటట్లు ఒక ఉద్దేశ్య పూర్వక ప్రయత్నం జరుగుతోంది. దాంతో ప్రజల జీవితానికి ,రాష్ట్ర ప్రగతికి , రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి , ప్రజల సంక్షేమానికి అవరోధంగా ఉన్న అసలైన సమస్యలు మరుగున పడి పోతున్నాయి.నిజానికి వలంటీర్ల సమస్యపై అంత ప్రాధాన్యం ఇచ్చి చర్చించాల్సిన అవసరంలేదు. వలంటీర్లు అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా తమ సొంత రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడంకోసం అధికారపార్టీ ఏర్పాటు చేసిన ఒక దారితప్పిన వ్యవస్థ.దానిపై అనవసరంగా చర్చించే బదులు..రాష్ట్ర ప్రగతికి, సర్వతో ముఖాభివృద్ధికి అవరోధంగా ఉన్న నిజమైన అంశాలపై చర్చను కేంద్రీకరించాలని అన్ని ప్రధాన రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో యల్.వి . సుబ్రహ్మణ్యం ఉపాధ్యక్షులు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ, డా” నిమ్మగడ్డ రమేష్ కుమార్ కార్యదర్శి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ , వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి సంయుక్త కార్యదర్శి సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ , డా”జంధ్యాల శంకర్ సభ్యులు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ. ప్రముఖులు పాల్గొన్నారు.

Exit mobile version