Home వార్తలు Bhairavakona: ఔషద మొక్కలకు పుట్టినిల్లు భైరవకోన

Bhairavakona: ఔషద మొక్కలకు పుట్టినిల్లు భైరవకోన

Bhairavakona: జిల్లాలోని సీఎస్ పురం మండలం అంబవరం, కొత్తపల్లి గ్రామానికి అరకిలో మీటరు దూరంలో ప్రకాశం – నెల్లూరు జిల్లా సరిహద్దులో తూర్పు కనుమల మధ్య ఒక లోయలో ఉన్న భైరవకోన క్షేత్రం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విశేషాలు ఉన్నాయి. కొండల నడుమ కొలువై ఉన్న అనేక దేవాలయాలు ఒక సమూహంగా ఉంటాయి. అత్యంత ప్రాచీన పల్లవ దేవాలయానికి అభిముఖంగా ఎనిమిది చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. పల్లవ శిల్పకారుడైన దేరుకంతి, శ్రీశైలముని మొదలైన వారు భైరవకోన క్షేత్రాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఎత్తైన కొండలపై ఉన్న లింగాల దొరువు నుండి ప్రవహించి 200 మీటర్ల ఎత్తు నుండి పడుతూ ఉండే జలపాతం అందాలు భైరవకోనలో యాత్రికులను కనువిందు చేస్తోంది.  

ఇక్కడి దుర్గాంబ ఆలయంలో అమ్మవారి విగ్రహం మీద కార్తీక పౌర్ణమి నాడు చంద్రకిరణాలు పడటం భైరవకోనకు ఉన్న మరో విశేషం. అందుకే ఈ రోజున పెద్ద సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు తరలివస్తుంటారు. శివరాత్రికి విచ్చేసే భక్తులు పక్కన ఉన్న జలపాతంలో పుణ్యస్నానం చేసి శివరూపాలను దర్శించుకుని పూజలు చేస్తారు. భైరవ కోన గుహలకు పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ఒకే కొండల మలిచిన ఎనిమిది శివలింగాలనూ ఏకకాలంలో దర్శించుకోవచ్చు. వీటిలో ఏడు దేవాలయాలు తూర్పు ముఖంగా, ఒకటి మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడ్డాయి. గర్భాలయాలు, వరండాలూ, స్తంబాలు అన్ని ఆ కొండరాయితోనే మరల్చడం విశేషం. శివలింగాలను మాత్రం గ్రానైట్ శిలలతో చెక్కి ప్రతిష్టించారు.

ఈ గుహల్లో ప్రధాన దైవం భర్గేశ్వరుడు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు భైరవుడు. ఆయన పేరు మీదనే దీన్ని భైరవక్షేత్రంగా పిలుస్తుంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పాలించాడనీ, అందుకే ఇది భైరవకోన అయిందని అంటుంటారు. అందుకు సాక్షంగా ఆ ప్రాంతం చుట్టూ కోటల ఆనవాళ్లు కనబడుతుంటాయి. ఈ క్షేత్రంలో ప్రతిష్టించిన శివలింగాలు ప్రముఖ శైవక్షేత్రాల్లోని శివలింగాలను పోలి ఉండటం వల్ల వాటిని కూడా ఆ పేర్లతోనే పిలుస్తుంటారు. మధ్యప్రదేశ్ లోని అమరనాథ్ లో కన్పించే శశినాగలింగం, మేరుపర్వత పంక్తిలోని రుద్రలింగం, కాశీ గంగాతీరంలోని విశ్వేశ్వర లింగం, తిరుమల కొండల్లోని నగరికేశ్వరి లింగం, భర్గేశ్వరలింగం రామనాథపురం సముద్రదీత ప్రాంతంలోని రామేశ్వరలింగం, శ్రీశైలంలోని మల్లికార్జున లింగం, మందరపర్వతంలోని పక్షమాతలింగం పేర్లతో ఈ క్షేత్రంలోని శివలింగాలను ఆరాధిస్తుంటారు. క్షేత్రంలోని ఎనిమిదవ గుహలో శివలింగంతో పాటు బ్రహ్మ, విష్ణువులుగా చెక్కిన బొమ్మలు దర్శనిస్తాయి. ఇక్కడకు వచ్చిన భక్తులు ఒకే చోట త్రిమూర్తులను దర్శించుకుంటారు. ఈ క్షేత్రానికి మరో విశేషం ఏమిటంటే ఈ ప్రాంతంలో అనేక ఔషద మొక్కలు లభిస్తుంటాయి. ఆయుర్వేద వైద్యానికి అవసరమైన అనేక మూలికలను ఇక్కడ నుండి సేకరిస్తూ ఉంటారు.  

Exit mobile version