Home వార్తలు ఇళ్ల వద్దనే పెన్షన్ అందించేలా ఆదేశాలు ఇవ్వండి : జన చైతన్య వేదిక

ఇళ్ల వద్దనే పెన్షన్ అందించేలా ఆదేశాలు ఇవ్వండి : జన చైతన్య వేదిక

రాష్ట్రంలో ఫించన్ ధారులకు మే 1,2వ తేదీల లోనే వారి వారి ఇళ్ల వద్దనే పెన్షన్లు పంపిణీకి కార్యాచరణ రూపొందించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర గవర్నర్, భారత ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకుని తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్ల వద్దనే పెన్షన్లు ఇవ్వడానికి ఇప్పటికి వరకు కార్యచరణ ప్రణాళిక రూపొందించకపోవడం దారుణమన్నారు. ఏప్రిల్ 30 నాటికి బ్యాంకుల నుండి నగదు తెప్పించుకుని పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పంచాయతీ సిబ్బంది లు ప్రణాళిక రూపొందిస్తే ఒక్కొక్క ఉద్యోగి మే 1,2వ తేదీలలో 42 మంది వృద్ధులకు ఇళ్ల వద్దనే పెన్షన్లు పంపిణీ చేయవచ్చు అని తెలిపారు. ఎప్రిల్ మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వలన 32 మంది వయోవృద్ధులు మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు. మే మొదటి వారానికి 45 డిగ్రీలకు చేరుతున్న పరిస్థితులలో గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని మే ఒకటి, రెండవ తేదీలలో వృద్ధులకు ఇళ్ల వద్దనే పెన్షన్లు అందించాలని ,తగిన ప్రచారం చేసి వృద్ధులకు భరోసా కల్పించాలని కోరారు. అధికార పార్టీకి లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో కొందరు అధికారులు సమస్య తీవ్రతను గుర్తించకుండా సచివాలయాల వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తామని పేర్కొనడం సరికాదన్నారు. అధికార పార్టీ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న వికృత చేష్టలకు అధికార యంత్రాంగం తోడ్పాటు అందించరాదని, వృద్ధుల ప్రాణాలను కాపాడాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

Exit mobile version