Home వార్తలు Yeluri Sambasivarao: ఇది మహిళా రైతుల విజయం

Yeluri Sambasivarao: ఇది మహిళా రైతుల విజయం

Yeluri Sambasivarao: అమరావతి రాజధానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అమరావతి నుండి ఏ కార్యాలయాన్ని తరలించకూడదని కూడా పేర్కొంది. రైతులకు మూడు నెలల్లోపు ప్లాట్లు అభివృద్ధి చేసి కేటాయించాలని పేర్కొంది. హైకోర్టు తీర్పు అమరావతి రైతులకు అనుకూలంగా వెలువడిన నేపథ్యంలో గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును పలువురు అమరావతి మహిళా రైతులు మర్యాదపూర్వకంగా కలిశారు.  

ఈ సందర్భంలో ఏలూరి మాట్లాడుతూ అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పు.. మహిళా రైతుల విజయమని అన్నారు. జగన్మోహనరెడ్డి సర్కారు విద్వేషపూరిత ఆలోచనలతో తలపెట్టిన మూడు ముక్కలాటకు హైకోర్టు తీర్పు చెంపపెట్టన్నారు. ప్రజా రాజధాని అమరావతి కోసం భూములు త్యాగం చేసిన‌ రైతులు, మహిళల పోరాటం మరువలేనిదని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ ముద్దు – రాజధాని వికేంద్రీకరణ వద్దు అన్న నినాదంతో అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు సాగించిన నిస్వార్థ మహా ఉద్యమ ఫలితమే ఈ తీర్పు అని ఏలూరి పేర్కొన్నారు. రైతుల దీక్షలు, పాదయాత్రలు, నిరసనల సందర్భంగా ప్రభుత్వం పోలీసులతో వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా వారు గుర్తు  చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టులు, నిర్బంధాలు, దాడులకు ఎదురొడ్డి శాంతియుత పోరాటంతో విజయం సాధించిన రైతులను ఏలూరి  అభినందించారు. న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర సందర్భంగా ప్రకాశం జిల్లాలో కొనసాగిన యాత్రలో ఎమ్మెల్యే ఏలూరి అందించిన సహకారాన్ని వారు గుర్తు చేసుకుని ధన్యవాదాలు తెలియజేశారు.

Exit mobile version