Home మా ఎడిటోరియల్ Political Survey: గొట్టిపాటి, మహిధర్ రెడ్డి టాప్..! మంత్రులిద్దరూ మైనస్..!? ఆ సర్వేలో సెన్సేషనల్ రిపోర్ట్..!!

Political Survey: గొట్టిపాటి, మహిధర్ రెడ్డి టాప్..! మంత్రులిద్దరూ మైనస్..!? ఆ సర్వేలో సెన్సేషనల్ రిపోర్ట్..!!

Political Survey: వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు 28 నెలలు కావస్తుంది. పొలిటికల్ సీజన్ ఆరంభంలో ఉంది. ప్రజల్లో బలం కోసం పార్టీల కసరత్తులు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని సర్వేలు అంటూ చాలానే బయటకు వచ్చాయి. అన్నిటి కంటే ఎక్కువగా “కేంద్ర నిఘా విభాగం సర్వే” అంటూ ఒక నివేదిక రాజకీయ వర్గాల్లో తిరుగుతుంది. దీనిలో పైపైన సారాంశం చాలా మందికి తెలిసినప్పటికీ.. ఏ నియోజకవర్గంలో పరిస్థితులు ఏమిటి..!? ఎవరి పనితీరు ఏమిటి..!? అనేది మాత్రం అంతగా బయటపడలేదు. మా అంతర్గత సోర్సులు ప్రకారం ఈ నివేదిక సారాంశాన్ని లోతుగా పరిశీలించగా.. జిల్లాలో నియోజకవర్గాల వారీగా అధ్యయనం ఆసక్తిగా సాగింది. ఎవరు మైనస్, ఎవరు ప్లస్ అనేది స్పష్టంగా ఈ నివేదికలో పేర్కొన్నారు.. నియోజకవర్గాల వారీగా ఈ సర్వే సారాంశాన్ని క్షుణ్ణంగా చూస్తే…!

ఒక్కొక్కరూ ఒక్కోలా.. వైసీపీకి కాస్త వెనుకబాటు..!

జిల్లాలో మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు ఉండగా.., 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున నలుగురు, వైసీపీ తరపున 8 మంది గెలిచారు. తర్వాత టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీకి మద్దతు తెలిపి, ఆ పార్టీలో యాక్టీవ్ అయ్యారు. ఈ 12 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు “రెడ్ జోన్” అంటే 60 శాతానికి పైగా ప్రతికూలత (నెగిటివ్) మూటగట్టుకున్నట్టు తెలుస్తుంది. అయిదుగురు ఎమ్మెల్యేలు “గ్రీన్ జోన్” అంటే 60 శాతం కంటే ఎక్కువ అనుకూలత (పాజిటివ్) లో ఉన్నట్టు తెలుస్తుంది. నియోజకవర్గాల వారీగా…

  • జిల్లా కేంద్రం ఒంగోలులో దాదాపు 4 వేల ఓటర్ల నమూనాలను అధ్యయనం చేసినట్టు సమాచారం. దీని ప్రకారం మంత్రి బాలినేని తీరు పట్ల 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇవన్నీ చిన్నపాటి సమస్యలే.. రానున్న రెండేళ్లలో బాలినేని సరిదిద్దుకుంటే, ప్రజల్లో బలంగా తిరిగితే మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది.
  • మరో మంత్రి ఆదిమూలపు సురేష్ నియోజకవర్గంలో మాత్రం ఆయనపై దాదాపు 70 శాతం వ్యతిరేకత ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఈ నియోజకవర్గంలో దాదాపు 3 వేల నమూనాలు పరిశీలించగా మైనస్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. గడిచిన రెండేళ్లలో ఆయన నియోజకవర్గంపై పెద్దగా ఫోకస్ పెట్టకపోవడం.., అక్కడ పార్టీలో అంతర్గత పోరు ఎక్కువగా ఉండడం.., సామజిక సమీకరణాల నేపథ్యంలో అధికార పార్టీలో విబేధాలు ఎక్కువవడం కీలక ప్రతికూలతలుగా మారాయి. మంత్రి సురేష్ కాస్త సమయం పెట్టి, సమస్యలను ఓపికగా పరిష్కరించే చొరవ చూపితే కాస్త మెరుగవ్వొచ్చు.
  • వైసీపీ ఎమ్మెల్యేల్లో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డికి ప్రజల్లో సానుకూలత ఉన్నట్టు ఈ సర్వేలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఈ నియోజకవర్గంలో 2500 ఓటర్ల నమూనాలు అధ్యయనం చేయగా.., దాదాపు 65 శాతం అనుకూలత ఉన్నట్టు సమాచారం.
  • వైసీపీ ఎమ్మెల్యేల్లో దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ పనితీరుపై ప్రతికూలత ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. అధ్యయనం ప్రకారం చూసుకుంటే.., ఈ నియోజకవర్గంలో దాదాపు 2500 ఓటర్ల నమూనాలు పరిశీలించగా, 70 శాతం వ్యతిరేకత ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ నియోజకవర్గంలో గ్రూపులు, పార్టీలో విబేధాలు, ఆరోపణలు ఎక్కువగా రావడం మద్దిశెట్టికి ప్రతికూలతగా మారినట్టు తెలుస్తుంది.
  • గిద్దలూరు నియోజకవర్గంలో 2500 ఓట్ల నమూనాలు అధ్యయనం చేయగా.., ఎమ్మెల్యే అన్నా రాంబాబు పనితీరుపై దాదాపు 58 శాతం వ్యతిరేకత ఉన్నట్టు పేర్కొన్నారు. మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాల్లో కూడా అదే పరిస్థితి ఉన్నట్టుగా సమాచారం.
  • మొత్తానికి వైసీపీ ఎమ్మెల్యేల్లో యర్రగొండపాలెం, సంతనూతలపాడు, దర్శి, కనిగిరి, మార్కాపురం, ఒంగోలు నియోజకవర్గాల్లో అసంతృప్తి ఎక్కువగా వ్యక్తమైనట్టు ఈ అధ్యయనంలో తేలినట్టు తెలుస్తుంది.

రవికుమార్ పై సానుభూతి.., బలరాంకి సానుకూలత..!!

ఇదే అధ్యయనంలో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కూడా ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. కొండపి ఎమ్మెల్యే స్వామి పనితీరుపై 52 శాతం సానుకూలత వ్యక్తమైనట్టు తెలిసింది. ఈ నియోజకవర్గంలో 2200 ఓట్ల నమూనాలు అధ్యయనం చేశారట.

  • చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం పార్టీ మారిన తర్వాత చీరాలలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి. అక్కడ దాదాపు 2900 ఓట్ల నమూనాలు అధ్యయనం చేయగా.. ఎమ్మెల్యే పనితీరుపై 59 శాతం సానుకూలత వచ్చినట్టు సమాచారం.
  • అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆర్ధిక వ్యవహారాలపై ప్రభుత్వం ఏకపక్షంగా దాడికి పాల్పడడం.., ఆయనను టార్గెట్ చేయడంతో అద్దంకిలో రవికుమార్ బలం పెరిగినట్టు ఈ అధ్యయనం ద్వారా తెలుస్తుంది. ఈ నియోజకవర్గంలో దాదాపు 2300 నమూనాలను అధ్యయనం చేయగా.., రవికుమార్ కి 71 శాతం అనుకూలత ఉన్నట్టు పేర్కొన్నారు. * పర్చూరులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పనితీరుపై 60 శాతం సానుకూలత వ్యక్తమైనట్టు తెలుస్తుంది.

ఇవి నిజమేనా..!? ఎంత వరకు నమ్మవచ్చు..!?

కొన్ని నెలల నుండి కేంద్ర నిఘా సంస్థ సర్వే అంటూ రాజకీయ, ఉన్నత వర్గాల్లో ఈ నివేదిక చక్కర్లు కొడుతోంది. జిల్లాలో ఫలితాలు, అధ్యనం తీరు చూస్తే వైసీపీ పట్ల వ్యతిరేకత, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట అనుకూలత కనిపిస్తుంది. దీనికి కొన్ని కారణాలు లేకపోలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఒత్తిడి, అంచనాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగానే విబేధాలు, గ్రూపులు, అవినీతి మరకలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలపై ఈ స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తుంది. అవన్నీ వచ్చే ఎన్నికల నాటికి ఉండకపోవచ్చు. ఒకసారి ఈ ఎమ్మెల్యేలు పొలిటికల్ మూడ్ లోకి వెళ్ళిపోతే.., జనంలో తమ ప్రతికూలతలు తెలుసుకుంటే.., ఒక్కోటి సరిచేసుకోవడం పెద్ద కష్టమేమి కాదు. గడిచిన రెండేళ్లలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశాలు చాలానే ఉన్నాయి. పైగా ఆ నియోజకవర్గాల్లో టీడీపీ ఇంచార్జిలు కూడా చురుకుగా లేకపోవడం ఎమ్మెల్యేలకు అదనపు బలం.

  • టీడీపీ ఎమ్మెల్యేలపై సానుకూలతకు కూడా ఇదే తరహా కారణాలు చెప్పుకోవచ్చు. వైసీపీ ఇంచార్జిలు ఉన్న మూడు నియోజకవర్గాల్లోనూ అనేక ఆరోపణలు, గొడవలు, విబేధాలు, వివాదాలు ఉన్నాయి. అద్దంకి నియోజకవర్గంలో కాస్త సరిదిద్దుకుని.. బలం పెంచుకుంటున్నప్పటికీ.., ఆ ఇంచార్జి కృష్ణ చైతన్యకు సరైన (కీలకమైన) రాష్ట్రస్థాయి పదవి ఇచ్చి ఉంటే అద్దంకి రాజకీయం మరో దశకు వెళ్ళేది. పర్చూరు, కొండపిలో వైసీపీ ఇంచార్జిల పరిస్థితి దారుణంగా ఉంది. ఆ పార్టీలో నెలకొన్న గొడవలు, విబేధాలు టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై మరింత సానుకూలతగా మారాయి.
Exit mobile version