Home వార్తలు వేటపాలెం మండలంలో ఉద్రిక్తత

వేటపాలెం మండలంలో ఉద్రిక్తత

బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం వివేకానంద కాలనీలో ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు సొన పోరంబోకు భూములను అధికారులు చదును చేయిస్తున్నారు. ఎమ్మెల్యే కరణం బలరాం ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. అయితే సొన పోరంబోకు భూముల పక్కనే వ్యవసాయ భూములు ఉన్నాయి. సొనలను పూడ్చడానికి అధికారులు జేసీబీని సిద్దం చేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే, పర్చూరు వైసీపీ ఇన్ చార్జి ఆమంచి కృష్ణమోహన్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే అయన అక్కడకు చేరుకున్నారు.

మరో వైపు ఎమ్మెల్యే కరణం బలరాం వర్గీయులు అక్కడ ఉండటంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీనివాసరావు, చీరాల రూరల్ సీఐ మల్లికార్జునరావు, వేటపాలెం ఎస్ఐ సురేష్ పెద్ద సంఖ్యలో పోలీసులతో అక్కడ మోహరించారు. ఈ సందర్భంగా ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ రైతులకు జలాధారమైన సొనలను దౌర్జన్యంగా పూడ్చి వేయడం నేరమన్నారు. సొనలను పరిరక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదని అయితే సొనలను పూడ్చివేతపైనే తమ అభ్యంతరమని చెప్పారు. ఈ సందర్భంలో తహశీల్దార్ మాట్లాడుతూ సొనల సమస్యను పరిష్కరించడంతో పాటు వారం లోగా ఇళ్ల పట్టాల లబ్దిదారులకు హద్దులు చూపిస్తామని తెలిపారు. దీంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది.

Exit mobile version