Home వార్తలు ఫించన్ల సొమ్మును సొంత కాంట్రాక్టర్లకు ఊడ్చిపెట్టిన జగన్‌రెడ్డి : అచ్చెన్నాయుడు

ఫించన్ల సొమ్మును సొంత కాంట్రాక్టర్లకు ఊడ్చిపెట్టిన జగన్‌రెడ్డి : అచ్చెన్నాయుడు

సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఫించన్లు ఒకటో తారీఖున వారి ఇంటికి చేర్చేందుకు ప్రభుత్వం యుద్దప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. జగన్‌రెడ్డి వాలంటీర్లను ప్రజా సేవా కార్యక్రమాలకు కాకుండా వైకాపా కార్యక్రమాలకు వాడుకుంటూ దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. వాలంటీర్లు ఎన్నికల కమిషన్‌ నిబంధనావళి ఉల్లంఘించే విధంగా చేసి వందల మందిని సస్పెన్షన్లకు, వారిపై క్రిమినల్‌ కేసుల నమోదుకు జగన్‌రెడ్డి కారకుడయ్యాడని పేర్కొన్నారు. జగన్‌రెడ్డి వాలంటీర్లను ప్రజా సేవకులుగా కాక తన పార్టీ కార్యకర్తల్లా ఉపయోగించుకున్నందుకే కేంద్ర ఎన్నికల సంఘం వారిని ఎన్నికల విధులకు దూరంగా పెట్టిందని తెలిపారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఒకటో తారీఖున పెన్షన్లకు ఇవ్వాల్సిన డబ్బును జగన్‌రెడ్డి.. తన అనుకూల కాంట్రాక్టర్లకు మొత్తం ఊడ్చిపెట్టాడని అచ్చెన్నాయుడు తెలిపారు. దీంతో పింఛన్ల సొమ్ములు ఇవ్వడానికి నేడు ఖజానాలో డబ్బులు లేకుండా పోయాయని చెప్పారు.

జగన్‌రెడ్డి తన దుర్మార్గాన్ని కప్పిపెట్టుకోవడానికి ఎన్నికల కమిషన్‌పైనా, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పైన దుష్ఫ్రచారానికి పాల్పడడం దుర్మార్గమన్నారు. పింఛన్‌దారుల పట్ల వైకాపాకు ఏ మాత్రం అభిమానం ఉన్నా ఖజానాలో ఎందుకు డబ్బులు లేకుండా చేశారో జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం…. వైకాపా కార్యక్రమాల్లో పాల్గొనకుండా ప్రజాసేవ మాత్రమే చేసే వాలంటీర్లను కొనసాగుస్తుందన్నారు. పింఛన్‌దారులకు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ను ఇంటివద్దకే వచ్చి పంపిణీ చేస్తుందని ఆయన తెలిపారు.

Exit mobile version