Home వార్తలు Rushikonda: ఒకే తీర్పు ..ఎవరికిష్టమొచ్చిన రీతిలో వాళ్ల రాతలు

Rushikonda: ఒకే తీర్పు ..ఎవరికిష్టమొచ్చిన రీతిలో వాళ్ల రాతలు

Rushikonda: ఏపిలో మీడియా ఏలా ఉందో అందరికీ తెలుసు. అధికార పక్షం (వైసీపీ)కి అనుకూలంగా కొన్ని, వైసీపీకి వ్యతిరేకంగా కొన్ని మీడియాలు ఉన్నాయి. ఆయా పార్టీలకు అనుకూలంగా అవి రాస్తుంటాయి. అయితే కోర్టు తీర్పులను సైతం వారికి అనుకూలంగా రాసుకోవడం విచిత్రం. ఏపిలో ప్రస్తుతం ఒక పత్రికలో వచ్చిన వార్తలను చదివి నమ్మే పరిస్థితి లేదు. రెండు మూడు పత్రికలు చదివిన తరువాత పాఠకుడు ఒక క్లారిటీకి వస్తున్నారు. సోషల్ మీడియా వచ్చేసిన తరువాత చాలా మంది పత్రికలు చదవడమే మానేశారు. విషయంలోకి వెళితే..

సుప్రీం కోర్టు ఈ రోజు విశాఖ రిషికొండ నిర్మాణాలకు సంబంధించి ఓ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని ఒక పత్రిక (సాక్షి)లో “ఎంపి రఘురామ కృష్ణంరాజుకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ” అన్న హెడ్డింగ్ తో వార్త ఇవ్వగా, మరో పత్రిక (ఆంధ్రజ్యోతి)లో “సుప్రీం కోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ” అన్న హెడ్డింగ్ తో వార్త ఇచ్చాయి. రుషి కొండ నిర్మాణాలపై గతంలో ఎంపి రఘురామ కృష్ణంరాజు ఎన్జీటీకి ఫిర్యాదు చేయగా ఎన్జీటీ ఓ అధ్యయన కమిటీని నియమించి, నిర్మాణాలపై స్టే ఇచ్చింది. ఎన్జీటీ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం..ఎన్జీటీ ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ కేసును హైకోర్టుకు బదిలీ చేసింది. హైకోర్టులో తేలేంత వరకూ ఇకపై కొత్త నిర్మాణాలు చేపట్టవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేస్తూనే పాత రిసార్ట్ ఉన్న ప్రాంతంలో మాత్రమే కొత్త నిర్మాణాలు చేపట్టడానికి అనుమతి ఇచ్చింది.

అయితే సుప్రీం కోర్టులో వాదనల సందర్భంలో ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను ఎవరికి తగ్గట్టు వాళ్లు అన్వయించుకుని పై హెడ్డింగ్ తో వార్తలు ఇచ్చాయి. అయితే..సుప్రీం కోర్టు కేసులోని మెరిట్స్ పై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదని, కేసు విచారణను హైకోర్టు జరుపుతుందని చెప్పింది. రుషికొండపై పర్యావరణ శాఖ చేస్తున్న నిర్మాణాలపై వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు గత ఏడాది ఎన్జీటీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై గత నెల 6వ తేదీన విచారణ జరిపిన ఎన్జీటీ  రుషికొండపై తవ్వకాలపై అధ్యయనం చేసేందుకు కమిటీని నియమిస్తూ నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలవడే వరకూ ఎలాంటి తవ్వకాలు, నిర్మాణాలు జరపరాదని ఏపి ప్రభుత్వానికి  ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ ఉత్వరులను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేయగా పై ఆదేశాలు జారీ చేసింది.  వాస్తవానికి పూర్తి స్థాయిలో సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించి తీర్పు వెల్లడించలేదు. హైకోర్టు విచారణ చేస్తుందని చెప్పింది. నిర్మాణాలపై పూర్తి స్థాయిలో అనుమతి ఇవ్వలేదు. కాకపోతే ఎన్‌జీటీ ఉత్తర్వులను, విచారణను సుప్రీం కోర్టు నిలుపుదల చేసింది.  

Exit mobile version