Home వార్తలు వర్మ త్యాగానికి ప్రాధాన్యత ఇస్తా: పవన్ కళ్యాణ్

వర్మ త్యాగానికి ప్రాధాన్యత ఇస్తా: పవన్ కళ్యాణ్

తన కోసం మాజీ ఎమ్మెల్యే మీ అందరి ఆదరాభిమానాలు చూరగొన్న వర్మ అసెంబ్లీ సీటును త్యాగం చేశారని, ఆ త్యాగాన్ని తాను ఎప్పుడు మర్చిపోలేనని, తాను కూడా అదే స్థాయిలో ఆయనకు ప్రాధాన్యత ఇస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావానికి జనసేనాని శ్రీకారం చుట్టారు. నేటి నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు పిఠాపురం నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. శనివారం గొల్లప్రోలు చేరుకున్న పవన్ కళ్యాణ్ తొలుత మర్యాదపూర్వకంగా మాజీ ఎమ్మెల్యే, పిఠాపురం టిడిపి ఇన్చార్జ్ ఎస్వీఎస్ వర్మ నివాసానికి నేరుగా వెళ్లారు. హెలిపాడ్ వద్ద కాకినాడ జనసేన పార్లమెంట్ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్,కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ,పెద్దాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మల బాబులతో పాటు పెద్ద సంఖ్యలో జనసైనికులు చేరుకుని ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి దొంతమూరుకు రోడ్ షో లో వెళ్లారు. దొంతమూరులో మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి చేరుకోగానే టిడిపి, జనసేన,బిజెపి నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ కు అఖoడ స్వాగతం పలికారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆత్మీయంగా వర్మను పలకరించి పూల బుకే ఇచ్చి అభినందించారు.

తెలుగుదేశం పార్టీ జిల్లా ఎన్నికల ఇంఛార్జి సుజయ కృష్ణ రంగారావు,వర్మ తో కలిసి పవన్ కళ్యాణ్ గంటకు పైగా ఎన్నికల ప్రచారాంశాలు,వ్యూహంపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్న వర్మ అభిమానులు , టిడిపి జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు.వర్మ మాట్లాడుతూ… పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీ తో గెలిపిస్తానని అన్నారు. పవన్ కళ్యాణ్ అనంతరం ఆయన బస చేసిన ప్రాంతానికి వెళ్లారు. తదుపరి ఆలయాల దర్శనం అనంతరం సాయంత్రం చేబ్రోలు లో వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

Exit mobile version