Home వార్తలు Gang rape: గుంటూరు జిల్లాలో గ్యాంగ్ రేప్..! గంటల వ్యవధిలో నిందితులు అరెస్టు..!!

Gang rape: గుంటూరు జిల్లాలో గ్యాంగ్ రేప్..! గంటల వ్యవధిలో నిందితులు అరెస్టు..!!

Gang rape: ఓ పక్క రాష్ట్రంలో మహిళల భద్రతపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. మరో పక్క మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దిశ లాంటి కఠన చట్టాలను అమలు చేస్తున్నా నేరాలు జరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. తాజాగా గుంటూరు జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. బైక్ పై వెళుతున్న దంపతులపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి మహిళపై సామూహిక అత్యాచారం చేశారు.  ఈ ఘటన మేడికొండూరు అడ్డరోడ్డు సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు గుంటూరు నగరంలో ఓ వివాహానికి హజరై బైక్ పై తిరిగి ఇంటికి వెళుతుండగా మేడికొండూరు అడ్డ రోడ్డు సమీపంలో వీరిని కొందరు దుండగులు అడ్డగించారు. యువకుడిని కొట్టి, అతని భార్యను సమీపంలోకి పొలాల్లోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె వంటిపై ఉన్న మంగళసూత్రం, ఇతర అభరణాలను లాక్కున్నారు.

ఈ ఘటనపై బాధితురాలు అర్థరాత్రి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా, ఘటన జరిగిన ప్రదేశం తమ పరిధి కాదంటూ ఫిర్యాదు స్వీకరించడానికి నిరాకరించారు. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ ప్రశాంతి పరిశీలించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్‌కి తరలించారు. అయితే ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే పోలీసులు దర్యాప్తులో పురోగతి సాధించారు. గ్యాంగ్ రేప్ ఘటనలో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పాలడుగు సమీపంలోని కోల్డ్ స్టోరేజ్ లో పని చేసే ఎనిమిది మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ఒడిశా, విజయనగరానికి చెందిన యువకులుగా గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

కాగా ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకోవడం బాధాకరమన్నారు.  బైక్ పై వెళుతున్న దంపతులుపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడటం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్ కు బాధితురాలు వెళితే తమ పరిధి కాదంటూ పోలీసులు చెప్పడం దారుణమన్నారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని విమర్శించారు.

Exit mobile version