Home విశ్లేషణ YS Viveka Case: సాగుతున్న వివేకా హత్య కేసు దర్యాప్తు..! కొత్త కొత్త ట్విస్ట్ లు..!!

YS Viveka Case: సాగుతున్న వివేకా హత్య కేసు దర్యాప్తు..! కొత్త కొత్త ట్విస్ట్ లు..!!

 

YS Viveka Case: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన మాజీ మంత్రి, సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. సీబీఐ దూకుడు పెంచి నెల రోజులకుపైగా కడపలోనే మకాం వేసి విచారణ జరుపుతున్నా ఒక కొలిక్కి వచ్చినట్లు కనబడటం లేదు. అయతే ఈ సారి ఎలాగైనా కేసు దర్యాప్తును పూర్తి చేసి అరెస్టులు చేసే అవకాశం ఉందని అందుకే ఇంతకు ముందులా కాకుండా రోజుల తరబడి విచారణను కొనసాగిస్తున్నారని అంటున్నారు.

అయితే సీబీఐ నాల్గవ విడత జరుపుతున్న ఈ విచారణలో అనేక ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి.  విచారణ క్రమంలో కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ కేసులో వివేకా కుమార్తె సునీతను విచారణ చేయాలంటూ సుబ్బారాయుడు అనే వ్యక్తి కోరడంతో సుబ్బారాయుడి పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. సునీత గతంలో ఇచ్చిన అనుమానితుల పేర్లలో సుబ్బారాయుడు పేరు ఇవ్వలేదు. ఇప్పుడు సుబ్బారాయుడు అనే వైసీపీ నాయకుడు పేరు చెప్పి విచారణ చేయాలని కోరడంతో కొత్త అనుమానాలకు తావు ఇస్తోంది.

ఇప్పటి వరకూ సీబీఐ అధికారులు ఎర్ర గంగిరెడ్డితో పాటు వివేకా పిఏ కృష్ణారెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లా, డ్రైవర్ ప్రసాద్, వైసీపీ కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్ తదితరులను ఎక్కువ సార్లు పిలిపించి విచారణ చేశారు. వివేకా హత్య జరిగిన రోజు రాత్రి ఆ ప్రాంతంలో సంచరించిన వాహనాలు వివరాలను కూడా సేకరించిన సీబీఐ అధికారులు సదరు వాహనాల యజమానులు, డ్రైవర్ లను పిలిచి కూడా విచారించారు. అయితే సీబీఐ దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలో వివేకా కుమార్తె కొత్త కొత్త పేర్లు తెరపైకి తీసుకురావడంతో సిబీఐ అధికారుల్లో కొత్త అనుమానాలు కలుగుతున్నాయట. సునీత ఏమైనా తెలిసిన విషయాన్ని దాస్తున్నారా ? ఆమె వద్ద ఏమైనా కీలక సమాచారం ఉందా? అనుమానితుల పేర్లు మొదట చెప్పకుండా ఇప్పుడు ఎందుకు వెల్లడిస్తున్నట్లు? అనేది దానిపై సీబీఐ అధికారుల మదిలో కొత్త ప్రశ్నలు మొదలు అవుతున్నాయి. ఏది ఏమైనా మరి కొద్ది రోజుల్లో అసలు దోషులను సీబీఐ అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయనీ అందుకే పూర్తి స్థాయిలో దృషి సారించారని అంటున్నారు.  

Exit mobile version