Home విశ్లేషణ మేనిఫెస్టో ప్రకటనపై మౌనమేలనోయి.

మేనిఫెస్టో ప్రకటనపై మౌనమేలనోయి.

ఎన్నికల వ్యవస్థలో రాజకీయ పార్టీలు అంతిమంగా అధికారమే లక్ష్యంగా పని చేస్తుంటాయి. అందులో భాగంగానే ప్రతి ఐదేళ్లకు జరిగే ఎన్నికలకు తమ పార్టీ విధానాన్ని, చేయబోయే సంక్షేమాన్ని , అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తమ మేనిఫెస్టో ను విడుదల చేస్తుంటాయి. సగటు ఓటరు కూడా పార్టీలకు అతీతంగా పార్టీల మేనిఫెస్టోను బేరీజు వేసుకుని ఓటు వేస్తారు.రాష్ట్రంలో జరిగిన 2019 ఎన్నికల్లో వైసిపి కి 50 శాతం ఓట్లు , 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపిలు రావడానికి కారణం కూడా ఆ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో నే కారణం అని రాజకీయ నిపుణులు భావిస్తూ ఉంటారు. దేశ వ్యాప్తంగా బలహీనంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లో అధికారం చేజిక్కించుకోవడానికి ఆ పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ ఫార్ములా నే కాంగ్రెస్ ను కాపాడాయి అనే చర్చ ఉంది. ఢిల్లీ లో అధికారంలో ఉన్న ఆప్ పంజాబ్ లో కూడా అధికారాన్ని విస్తరించడానికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను మేనిఫెస్టో లో ప్రవేశ పెట్టి విజయం సాధించింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు ఓటములను మేనిఫెస్టో కూడా మెజారిటీ స్థాయిలో ప్రభావితం చేస్తూ ఉంటుందండానికి ఇలాంటి సాక్ష్యాలు గత ఐదేళ్లుగా చూస్తూ ఉన్నాం. మేనిఫెస్టో కు అంతటి ప్రాధాన్యత ఉన్నది కాబట్టే ప్రధాన పార్టీలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటాయి.రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చినప్పటకి అధికార వైసిపి,ప్రతిపక్ష పార్టీలు అధ్యక్షులు మాత్రం మేనిఫెస్టో పై నోరు విప్పడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లా మేదరమెట్ల లో జరిగిన చివరి సిద్ధం సభలో మేనిఫెస్టో ప్రకటిస్తామని వైసిపి కీలక నాయకులు ప్రకటించారు.కానీ జగన్మోహన్ రెడ్డి ప్రసంగం లో ఎక్కడా హామీల జల్లు కురిపించలేదు. మేనిఫెస్టో ప్రకటన వలన సభకు ఊపు వచ్చింది కానీ హామీల జాబితా రాలేదు. టిడిపి , జనసేన, బిజెపి కూటమి సంయుక్తంగా చిలకలూరిపేటలో బొప్పుడి సభలో మేనిఫెస్టో ప్రకటిస్తామని టిడిపి కీలక నేతలు చెప్పారు.కానీ వారు కూడా షాక్ ఇచ్చారు.

  • మేనిఫెస్టో పై ఎత్తులకు పై ఎత్తులు

గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికలకు 100 రోజుల ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటించారు. కానీ మేనిఫెస్టో పై కేసీఆర్ వేచి చూశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో అసాధ్యం అని విమర్శిస్తునే అంతకుమించి హామీల వర్షం కేసీఆర్ కురిపించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా మేనిఫెస్టో పై చివరి వరకు వేచి చూసే ధోరణిలో ప్రధాన పార్టీలు ఉన్నాయి. నాలుగు నెలల క్రితమే టిడిపి, జనసేన లు 11 అంశాలతో మినీ మేనిఫెస్టో ని ప్రజల్లోకి తీసుకువెల్లాయి. రానున్న రోజుల్లో యువత, రైతాంగం, రాజధాని, సంక్షేమం లతో కూడిన రాష్ట్ర అభివృధి లక్ష్యంగా మేనిఫెస్టో ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా నవరత్నాలు, ఆరోగ్యశ్రీ అమలు చేయవలసిందే…వాటికే రాష్ట్ర బడ్జెట్ దాటిపోతుంది. అలాంటప్పుడు చంద్రబాబు మినీ మేనిఫెస్టో కే బడ్జెట్ సరిపోదు.ఇక పూర్తి మేనిఫెస్టోతో రాష్ట్రం అప్పుల్లో కి కూరుకుపోతుంది అని జగన్మోహన్ రెడ్డి సభలో వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలకే కేంద్రం తో పొత్తు పెట్టుకున్నాం. ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెడతాము అని చంద్రబాబు ధీమా గా ఉన్నారు. అధికారం లోకి రాగానే హామీలు అమలు ఎలా ఉన్నా… ప్రధాన పార్టీలు భారీ స్థాయిలో తాయులాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని..అందులో భాగంగానే ఒకరు ప్రకటించిన తరువాత మరొకరు భారీ ఎత్తున హామీలు గుప్పించెందుకు ఆలస్యం చేస్తున్నారని సమాచారం. ఎన్నికలకు ఇంకా 40 రోజులు సమయం మాత్రమే ఉంది. పూర్తి విశ్వాసంతో, సాధ్యం అయ్యే హమీలను ఇచ్చి అమలు చేసే పార్టీలకే ఓటు వేద్దాం.సాధ్యం కాని హామీలను ఇచ్చే పార్టీలను భూస్థాపితం చేసే విధంగా రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం.

Exit mobile version