Home విశ్లేషణ Prakasam TDP: నీటి కోసం ఢిల్లీస్థాయిలో పోరాటం.. అవినీతిపై యుద్ధం..!

Prakasam TDP: నీటి కోసం ఢిల్లీస్థాయిలో పోరాటం.. అవినీతిపై యుద్ధం..!

Prakasam TDP: Meeting Internal Discussions
Prakasam TDP: Meeting Internal Discussions
  • వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిపై ఇక పోరాటం
  • దళితులను అన్నివిధాలా మోసగిస్తున్న జగన్
  • టీడీపీ జిల్లా సమావేశంలో అనేక అంశాలపై చర్చ..!

Prakasam TDP: రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో లేని విధంగా… మన జిల్లాలోనూ గత రెండేళ్లలో ఏనాడూ లేని విధంగా… జిల్లా టీడీపీ కదిలింది. ప్రభుత్వ నిర్లక్ష్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను, మోసపూరిత పరిపాలనను ఎండగట్టేందుకు సిద్ధమవుతోంది.. అన్నిటి కంటే ముఖ్యంగా జిల్లాకు ప్రాణాధారమైన వెలుగొండ ప్రాజెక్టుకి కేంద్ర గెజిట్ సాధన కోసం ఢిల్లీ వెల్;ఐ, కేంద్ర జలశక్తి మంత్రిని కలవాలని, సాగర్ నీటి కోసం రైతులతో కలిసి పోరాడాలని పార్టీ ఏకాభిప్రాయంతో నిర్ణయించింది..! ఈ మేరకు ప్రకాశం జిల్లా టీడీపీ కీలక నేతల (ఎమ్మెల్యేలు, ఇంచార్జిలు) సమావేశం ఈరోజు ఒంగోలులో జరిగింది. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు.., పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి, మాజీ ఎమ్మెల్యేలు అశోక్ రెడ్డి, దివి శివరాం, విజయ్ కుమార్, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని కీలక అంశాలతో పాటూ.., జగన్ పాలనలో అనేక లోపాలను, జిల్లాలో పెట్రేగుతున్న అవినీతిని చర్చించి, ప్రజలతో కలిసి పోరాడాలని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు..!

Prakasam TDP: చర్చించిన కీలకాంశాలు ఇవే…!

  • వెలుగొండ ప్రాజెక్టుకి కేంద్ర గెజిట్ లో చోటు దక్కలేదు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ కి లేఖ రాసినప్పటికీ అధికార పార్టీ నుండి పెద్దగా స్పందన లేదు. జిల్లాకు ప్రాణాధారమైన ప్రాజెక్టుపై అధికార పార్టీ నిర్లక్ష్యంగా ఉందని.., దీనిపై టీడీపీ తరపున ఢిల్లీ వెళ్లి కేంద్రం జలశక్తి మంత్రిని కలిసి విన్నవించాలని పార్టీ నేతలు నిర్ణయించారు.
  • జిల్లాలో దాదాపు 24 మండలాల్లో సాగుకి కీలకమైన సాగర్ నీటి విడుదలకి వెంటనే షెడ్యూల్ ప్రకటించాలని పార్టీ నేతలు డిమాండ్ చేసారు. గత ఏడాది కూడా నీరు ఇవ్వలేదని.. ఇప్పుడు సాగర్ లో నీరు అందుబాటులో ఉన్న కారణంగా రైతులకు సాగునీటిని అందించాలని టీడీపీ నేతలు పట్టుపట్టనున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఈ మేరకు రైతులతో కలిసి పోరాడాలని నిర్ణయించారు. అటు వెలుగొండ, ఇటు సాగర్ నీటిపై పార్టీ తరపున పోరాడాలని, రైతులకు అండగా నిలవాలని నిర్ణయించారు.
Prakasam TDP: Meeting Internal Discussions

ఓటేసిన వారిని మోసం చేస్తున్న జగన్..!

జగన్ అధికారంలోకి రావడంలో కీలకంగా ఉన్న దళితులు, ఉద్యోగ వర్గాలను జగన్ తీవ్రంగా మోసం చేస్తున్నారని టీడీపీ జిల్లా నేతలు అభిప్రాయపడ్డారు. డాక్టర్ సుధాకర్ ని అన్యాయంగా పొట్టన పెట్టుకుని.., గత ఏడాది చీరలకు చెందిన కిరణ్ ని కూడా మాస్కు లేదని కొట్టి చంపేసి.., ఇప్పటికీ ఈ కుటుంబాలకు న్యాయం జరగలేదని పార్టీ నేతలు చర్చించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో జరిగిన శిరోముండనం వ్యవహారం మొదలుకుని.. ఈ వైసిపి ప్రభుత్వం దళితులపై అనేక విధాలుగా కక్ష తీర్చుకుంటుంది అంటూ టీడీపీ నేతలు ఈ సమావేశంలో అంతర్గతంగా వ్యాఖ్యానించినట్టు తెలిసింది.

  • ఉద్యోగులకు కూడా జగన్ మోసం చేస్తున్నారని.. ఇప్పటికి ఏడు డీఏలు ఇవ్వలేదు.. పైగా పీఆర్సీ ప్రకటించలేదు.., హామీ ఇచ్చినట్టు సీపీఎస్ కూడా రద్దు చేయలేదు.. ఇవన్నీ చూస్తుంటే ఉద్యోగులను అన్నివిధాలుగా జగన్ ప్రభుత్వం మోసం చేస్తుందని నేతలు చెప్పుకొచ్చారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ నాటి వరకు ఎన్నడూ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం అవ్వలేదని.. అటువంటిది జగన్ అధికారం చేపట్టిన తర్వాత మాత్రమే పదిహేనో తేదీవరకు జీతాలు ఇవ్వడం లేదని.. పెన్షనర్లకు కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సమస్యలను చర్చించి.., ఒక నోట్ తయారు చేశారు.
Prakasam TDP: Meeting Internal Discussions

జిల్లాలో అవినీతి పెట్రేగుతోంది..!!

ప్రకాశం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఇంచార్జిల అవినీతి విచ్చలవిడిగా జరుగుతుందని.. టీడీపీ ముఖ్య నేతలు చర్చించారు. ఈ అవినీతి వ్యవహారాలను ఆధారాలతో సహా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రేషన్ బియ్యం.., గ్రానైట్.., మట్టి, ఇసుక ఇలా అన్ని వ్యవహారాల్లోనూ వైసిపి ఎమ్మెల్యేలు, ఇంచార్జిలు దోచుకుంటున్నారని… అందరి బాగోతాలతో త్వరలోనే ప్రజలను ఆధారాలతో వివరించాలని ఈ సమావేశంలో టీడీపీ నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. నియోజకవర్గాల వారీగా వైసిపి అవినీతి బాగోతాలని బహిరంగపర్చాలని చర్చించినట్టు తెలిసింది.

“మొత్తానికి టీడీపీ సమావేశంతో పార్టీలో ఒక నూతన జోష్ వచ్చింది. రెండేళ్ల తర్వాత అన్ని నియోజకవర్గాల నేతలు కలవడం.. అధికార పార్టీ తప్పిదాలపై, జిల్లా సమస్యలపై చర్చించడం.., పార్టీ బాగోగులపై క్షేత్రస్థాయి ఇబ్బందులపై మాట్లాడడంతో దిగువ స్థాయి శ్రేణుల్లో కొత్త చర్చ మొదలయింది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ స్థాయిలో నేతలు కలుసుకుని మాట్లాడడం ఇదే తొలిసారి. ఇతర జిల్లాల్లో కూడా జిల్లాస్థాయిలో ముఖ్యుల కలయిక జరగలేదు” అయితే సమావేశంలో చర్చించిన అంశాలని ఎంత మేరకు అమలు చేయగలరు..? ఏ మేరకు ఫలితాలు రాబెట్టగలరు..? అనేది కీలక అంశంగా మారింది..!

Exit mobile version