Home విశ్లేషణ వైసిపిలో బాలినేని కథ ముగియలేదు….రానున్న రోజుల్లో పోకిరి తరహాలో ట్విస్ట్లు..

వైసిపిలో బాలినేని కథ ముగియలేదు….రానున్న రోజుల్లో పోకిరి తరహాలో ట్విస్ట్లు..

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసిపికి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక నాయకుడు. గత ఎన్నికల్లో ఆయన చెప్పిన వారికే సీట్లు కేటాయించి గెలిపించుకున్నారు. పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత మూడేళ్లు మంత్రిగా ఉండగా జిల్లాలో ఆయన పెత్తనం నడిచింది.మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ లో ఆయన మంత్రి పదవిని కోల్పోయాక వరుస అవమానాలు వెంటాడుతున్నాయి. వైసిపి నుంచి ఇప్పటి వరకు విడుదల అయినా ఇంఛార్జి ల ఏడు జాబితాల్లో ఆయన పేరు లేకపోవడం పలు అనుమానాలను రేపుతుంది.మొదట నుంచి గిద్దలూరులో పోటీకి సిద్ధం గా ఉండాలని అధిష్టానం బాలినేనికి చెపుతూ వచ్చింది. ఐతే గిద్దలూరు లో పోటీ చేయడం ఇష్టం లేదని అధిష్టాన నిర్ణయాన్ని సున్నితంగా తిరస్కరిస్తూనే..ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి కే మరలా టికెట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే విషయంపై చాలా రోజులు చర్చ నడిచింది.చివరకి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియమించిన తరువాత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ..తాడేపల్లి వెళ్లి జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరిపి తరువాత ఆయన కొంచెం అధిష్టానం పై మెత్తబడ్డారు.చివరకి ఒంగోలు లో ఇళ్ల స్థలాలు కు నిధులు మంజూరు చేయించుకొని నియోజకవర్గానికి వచ్చారు.

చీరాల నుంచి బరిలోకి బాలినేని ?

నిన్న రాత్రి విడుదల ఆయిన ఏడవ జాబితాలో పర్చూరు,కందుకూరు నియోజకవర్గాలకు ఇంఛార్జి లను నియమించారు. వారం క్రితం సిఎం జగన్మోహన్ రెడ్డి తో చర్చలు జరిగినా తరువాత కూడా ఒంగోలు స్థానం ను బాలినేని కి కేటాయించకపోవడం జిల్లా రాజకీయాలను ఆసక్తిని రేకెత్తించింది.మరో పక్క చీరాల నుంచి తప్పితే తాను ఎక్కడ పోటీ చేయనని పర్చూరు ఇంఛార్జి గా ఆమంచి కృష్ణమోహన్ అధిష్టానానికి చెపుతూ వచ్చారు.అందులో భాగంగానే పర్చూరు కు కొత్త ఇంఛార్జి గా ఎడం బాలాజీ ను నియమించారు.చీరాల ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకొనేది లేదని చెప్పిన ఆమంచి కి ప్రత్యామ్నాయ మార్గం టిడిపి…జనసేన నే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

చీరాల నుంచి టీడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ బరిలో ఉంటే ప్రస్తుత వైసిపి నియోజక వర్గ ఇంఛార్జి కరణం వెంకటేష్ ఓడిపోయే పరిస్థితి ఉందని సమాచారం. రాజకీయ ఆరంగేట్రం లోనే 2014 ఎన్నికల్లో అద్దంకి అసెంబ్లీ స్థానంలో కరణం వెంకటేష్ ఓటమి పాలయ్యారు. మరోపక్క అదే ఎన్నికల్లో టిడిపి,వైసిపి లను ప్రక్కుకు నెట్టి ఇండిపెండెంట్ గా గెలిచిన చరిత్ర ఆమంచి కృష్ణమోహన్ కి ఉంది. అందులో భాగంగానే బలమైన ఆమంచి కృష్ణమోహన్ ను ఎదుర్కోవాలి అంటే జిల్లాలో సీనియర్ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రమే అనే ఆలోచన వైసిపి పెద్దలు చేస్తున్నారని సమాచారం. ఆ నిర్ణయాన్ని బాలినేని అంగీకరిస్తారా లేదా అన్నది అనుమానమే. ఒంగోలులో ఇండ్ల స్థలాలుకు నిధులు ఇచ్చి కఠిన నిర్ణయాలు తీసుకోకుండా బాలినేని నీ కొంత మేర ఆపే ప్రయత్నం వైసిపి అధిష్టానం చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గెలిచిన స్థానంలో బాలినేని పోటీకి సిద్ధం గా ఉండరని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మద్దిశెట్టి కి లైన్ క్లియర్ అవుతుందా ?

దర్శి నియోజకవర్గంలో వైసిపి నుంచి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి పోటీ చేయనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న మద్ధిశెట్టి వేణుగోపాల్ మాత్రం జిల్లాలో వేరే చోట నుంచి అయిన పోటీ కి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని మీడియా సమావేశంలో తెలిపారు.ఖాళీగా ఉన్న రెండు స్థానాల్లో… చీరాల నుంచి బాలినేని విముఖత వ్యక్తం చేస్తే..బలిజ సమాజిక వర్గం కు చెందిన మద్ధి శెట్టి వేణుగోపాల్ ను పంపించే ఆలోచనలో వైసిపి ఉందని సమాచారం.ఒంగోలు పార్లమెంట్ స్థానం మద్ది శెట్టి ఆశించిన్నప్పటకి చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియమించడం తో ఆ ఆశలకు చెక్ పడింది.ఇక మద్ది శెట్టి కి మిగిలింది ఒంగోలు ,చీరాల అసెంబ్లీ స్థానాలు మాత్రమే.బాలినేని కఠిన నిర్ణయాలు తీసుకుంటే ఒంగోలు అసెంబ్లీ స్థానంలో మద్దిశెట్టి పోటీ చేస్తారు అని సమాచారం.లేని పక్షంలో చీరాలలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆమంచి వెర్సెస్ మద్దిశెట్టి పోటీ తప్పదని సమాచారం. ఎది ఏమైనా బాలినేని తీసుకునే నిర్ణయమే జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version