Home మా ఎడిటోరియల్ Prakasam TDP: ఆయువిచ్చిన ఆ ఎమ్మెల్యేలు..! గేరు మార్చిన జిల్లా టీడీపీ..!!

Prakasam TDP: ఆయువిచ్చిన ఆ ఎమ్మెల్యేలు..! గేరు మార్చిన జిల్లా టీడీపీ..!!

Prakasam TDP: నీరసం వీడి నినాదాల్లోకి నాయకులు

ఇక నెలకో కీలక కార్యక్రమానికి శ్రీకారం..!

Prakasam TDP: దారుణంగా ఓడిపోయామన్న నీరసం.. కేసులు పెట్టి వేధిస్తున్నారన్న భయం.. నాయకత్వంపై నమ్మకం లేని అభద్రతాభావం.. వెరసి తెలుగుదేశం పార్టీ రెండేళ్ల నుండి నిద్రలోకి జారుకుంది. అడపాదడపా లేచి ఉన్నామని ఉనికి చాటి మళ్ళీ పడుకునేది.. కానీ రెండేళ్లు గడిచిపోయాయి. ఇంకా అలాగే ఉంటే పార్టీ ఉనికికి పెను ప్రమాదం తప్పదు.. అందుకే నాయకులు చురుకయ్యేలా.., కార్యకర్తలు ధీమాగా ఉండేలా జిల్లాలో టీడీపీ గేరు మార్చింది. 40 రోజుల కిందట జిల్లా ఎమ్మెల్యేలు దీనికి బాట వేయగా.. ఇప్పుడు జిల్లాలో నియోజకవర్గాల ఇంచార్జిలు, ముఖ్య నేతలు బాధ్యతలు భుజాన వేసుకున్నారు. నీరసం వీడి నిరసనల్లోకి.., నిద్ర వీడి నినాదాల్లోకి శ్రేణులను పంపిస్తున్నారు. అధికార పార్టీపై పోరాటానికి శక్తులు అందించే ప్రయత్నం చేస్తున్నారు.

Prakasam TDP: ఆ లేఖతో శ్రేణులకు ఆయువు..!!

అధికార పార్టీ దూకుడుగా ఉంది. ఊరికూరికే కేసులు పెట్టేస్తుంది. నయానోభయానో లొంగదీసుకోవాలని చూస్తుంది. అందుకే కార్యకర్తలు, దిగువ స్థాయి నాయకులు పార్టీలో ఏ మాత్రం ఉనికి లేకుండా ఉండిపోయారు. కానీ గత నెలలో వాళ్ళందరూ కాలర్ ఎగరేసుకునేలా జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు కలిసి సీఎం జగన్ కి లేఖ రాశారు. “రాయలసీమ ఎత్తిపోతల పథకం”పై ఉన్నదీ ఉన్నట్టు.., ప్రజాప్రయోజనం, జిల్లా ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని మంచి లేఖ రాశారు. దీనికి జిల్లాలోని అధికార పార్టీ నాయకులు ఎవ్వరూ సమాధానం ఇవ్వలేదు. వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఆ లేఖపై రాజకీయంగా, అధికారికంగా ఏమి మాట్లాడలేదు. కనీసం లేఖని విమర్శించలేదు. ఈ అంశంతో జిల్లా ఎమ్మెల్యేలు పైచేయి సాధించారు. తద్వారా టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ మొదలయింది. అదే పార్టీ శ్రేణులకు ఆయువిచ్చింది. ఆ ఎమ్మెల్యేలపై, పార్టీల మార్పులపై, కేసుల భయంపై కార్యకర్తల్లో అక్కడక్కడా నెలకొన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. ఆ లేఖ తర్వాత వారంలోనే వెలుగొండ ప్రాజెక్టుని కేంద్ర గెజిట్ కోసం మరో లేఖ రాశారు. ఈ రెండు లేఖలతో జిల్లాలో అధికార పార్టీ ఒకరకంగా ఇరుకున పడింది. దాటవేసింది. టీడీపీ ఎమ్మెల్యేలు జనం మధ్య చర్చయ్యారు. రైతు, ప్రజాసంఘాలకు గొంతయ్యారు. జిల్లాలో టీడీపీ చురుకయ్యేలా ఇది మొదటి అడుగు.

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పరామర్శ…

Prakasam TDP: షెడ్యూల్ మార్చుకున్న ఆ ఎమ్మెల్యేలు..!!

జిల్లాలో కొండపి ఎమ్మెల్యే స్వామి విషయంలో ఎటువంటి అనుమానాలు ఉండేవి కావు. ఆయన మొదటి నుండి వైసీపీ తప్పిదాలపై ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉంటున్నారు. కానీ కొన్ని నెలల నుండి జిల్లాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపై విపరీతమైన చర్చ.. టీడీపీలో ఉంటారా..? పార్టీ మారతారా..!? అంటూ ఎవరికీ వారు పుకార్లు, ప్రచారాలతో సోషల్ మీడియాలో హోరెత్తించారు. కానీ రెండు నెలల నుండి ఆ ఇద్దరు ఎమ్మెల్యేల అడుగులు మారాయి. అధికార పార్టీని ప్రశ్నించడంలో ముందుంటున్నారు. నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటనలు చేస్తున్నారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కొన్ని రోజుల నుండి నియోజకవర్గంలో విస్తృత పర్యటనలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. గ్రామస్థాయి కార్యకర్తలు పిలిచే ప్రతీ కార్యక్రమానికి హాజరవుతున్నారు. రోజుకి 8 నుండి 10 గ్రామాలూ తిరుగుతూ.., ప్రతీ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల నుండి అద్దంకిలో టీడీపీ పరిస్థితి మారింది. ఎమ్మెల్యే విషయంలో నెలకొన్న అనుమానాలు తొలగిపోయి శ్రేణులు ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ప్రారంభించారు. * పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కూడా ఈ రెండు నెలలు పార్టీ శ్రేణులు, ప్రజల మధ్య గడుపుతున్నారు. నియోజవకర్గంలో సైలెంట్ అయ్యారు.., పార్టీ బాపట్ల బాధ్యతలపై ఆసక్తి చూపడం లేదు అంటూ మొదట్లో జరిగిన ప్రచారం తప్పు అని నిరూపిస్తున్నారు. ఓ వైపు నియోజకవర్గంలో కార్యకర్తల కార్యక్రమాలకు హాజరవుతూనే.., మరోవైపు బాపట్ల అధ్యక్షుడిగా పక్క నియోజకవర్గాల బాగోగులపై సమీక్ష చేస్తున్నారు. నిత్యం కార్యకర్తలు, నాయకులతో గడుపుతున్నారు.

పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు పర్యటనలు…

నెలకోమారు చర్చ – మంచి కార్యక్రమం..!!

గత నెలలోనే జిల్లా సమస్యలు, ప్రభుత్వ లోపాలపై జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు భేటీ అయ్యారు. జిల్లాలోనూ.., రాష్ట్రస్థాయిలోనూ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అనేక అంశాలపై చర్చించారు. అంతర్గతంగా జిల్లాలో పార్టీ పరిస్థితిని, నియోజకవర్గాల వారీగా మెరుగవ్వాల్సిన అంశాలను చర్చించారు. ఒక నివేదిక రూపొందించుకుని.., ఎక్కడికక్కడ కొన్ని ప్రణాళికలు వేసుకున్నారు.

  • ఇది మొదలు జిల్లాలో టీడీపీ హడావిడి మొదలయింది. రెండు రోజుల కిందట యర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరువులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరిగింది. జిల్లాలో ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. జనం కిక్కిరిసారు. నాయకులూ ఉత్సాహంతో ఉప్పొంగారు. శ్రేణులు చురుకయ్యారు. ఇదే క్రమంలో ఇక మీదట ప్రతీ నెల ఏదో ఒక నియోజకవర్గంలో ఒక పెద్ద కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలనేది పార్టీ పెద్దల ఆలోచన. వచ్చేనెలలో గిద్దలూరులో కూడా ఎన్టీఆర్ విగ్రహాల ఆవిష్కరణ చేయనున్నారు. ఆ తర్వాత చీరాల, కందుకూరులో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మొత్తానికి జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలోనూ ఏదో ఒక కొత్త తరహా.., పెద్ద కార్యక్రమంతో శ్రేణులకు ఊపొచ్చేలా చేయడమే ఉద్దేశంగా పార్టీ నేతల అడుగులు పడుతున్నాయి.
Exit mobile version