Home మా ఎడిటోరియల్ Balineni Sreenivasa Reddy: బాలినేని మెట్టు దిగారా – పట్టు వీడారా – గట్టు మారారా..!?...

Balineni Sreenivasa Reddy: బాలినేని మెట్టు దిగారా – పట్టు వీడారా – గట్టు మారారా..!? ఒట్టు “మాగుంట జన్మదినమే” వేదిక..!!

Balineni Sreenivasa Reddy: Changing in Subject to Party Issues
Balineni Sreenivasa Reddy: Changing in Subject to Party Issues

Balineni Sreenivasa Reddy: వాళ్లిద్దరూ జిల్లా రాజకీయాల్లో పేరొందిన రెండు బ్రాండ్లు.. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం.. ఒకే పార్టీ (ఓ ఐదేళ్లు తప్ప).. పైగా పేర్లు కూడా ఒకటే.. కానీ ఎందుకో పెద్దగా కలుసుకోరు.., మనస్పూర్తిగా మాట్లాడుకోరు.., పెత్తనం పంచుకోరు.., అప్పుడప్పుడు తప్పితే ఎప్పుడూ కలిసి పని చేయరు.. జిల్లాలో అధికార పార్టీలో ఉన్న లోపాలు, లోటుపాట్లులో ఈ ఇద్దరి వ్యవహారశైలి కూడా ఒక పెద్ద విషయమే..! కారకులు ఎవరైనా కావచ్చు, తప్పు ఎవరి వైపైనా ఉండొచ్చు, కానీ ఈ ఇద్దరి విషయంలో జిల్లా వైసీపీలో తరచూ చర్చ నడుస్తూ ఉండేది.. అటువంటిది కొన్ని రోజులుగా ఈ వ్యవహారం మారుతున్నట్టే కనిపిస్తుంది. ముఖ్యంగా రెండురోజుల కిందట జరిగిన జన్మదిన వేడుకల్లో ఈ ఇద్దరు కలుసుకోవడం.., కేకు తినిపించుకోవడం.., ముచ్చట్లు చెప్పుకోవడం జిల్లాలో అధికార పార్టీకి ఒక ఊరట.., కానీ లోలోపల అనేక ఊసులు/ ఊగిసలాటలు.. ఆ ఇద్దరూ ఎవరనేది గ్రహించే ఉంటారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. మొన్న జరిగిన మాగుంట జన్మదిన వేడుకలకు బాలినేని హాజరవ్వడం.., కాసేపు అక్కడే గడపడం.., కలిసి మాట్లాడడం.. కొన్ని అనుమానాలకు సమాధానమిచ్చింది… అదే సమయంలో కొత్త అనుమానాలకు తావిచ్చింది..! బాలినేనిలో ఈ ఆకస్మిక మార్పు ఏమిటా అనేది మొదటి ప్రశ్న అయితే.., ఈ కలయిక తాత్కాలికమా, ఇక మీదట కూడానా అనేది రెండో ప్రశ్న..! ఇక్కడ ప్రధానంగా మూడు అంశాలు చర్చించాల్సి ఉంది.. బాలినేనిలో ఈ ఆకస్మిక మార్పు.., మాగుంటతో విబేధాలు.., జిల్లాలో పెత్తనం..? ఈ అంశాలను ఒక్కోటీ చూద్దాం..!

Balineni Sreenivasa Reddy: Changing in Subject to Party Issues

Balineni Sreenivasa Reddy: బాలినేని ఇంతలో ఇలా..!?

బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే సౌమ్యుడు.. మంచి నాయకుడు.. ఇంటికి ఎవరు వెళ్లినా ఆదరించి, పనులు చేసే వ్యక్తి.. వాసన్నా అని పిలిస్తే దగ్గరకు తీసుకునే నేత.. ఇవన్నీ 2019కి ముందు వరకు.. మొదటి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, వైఎస్ హయాంలో ఓ సారి మంత్రిగా కూడా పనిచేసిన బాలినేనికి ఈ తరహా పేరుంది. కానీ 2019 లో ఆయన గెలిచిన తర్వాత.. మంత్రి పదవి చేపట్టిన తర్వాత క్రమేణా పేరు మారింది. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రెండు నెలల్లోనే “లెటర్ హెడ్ దుర్వినియోగం” అంటూ కొన్ని ఆరోపణలు వచ్చాయి. వాటికి ఆయన సమాధానమిచ్చారు.. ఆయనకు సంబంధం లేకుండా దగ్గరి వ్యక్తుల ప్రమేయంగా తేలింది.. ఆపై ఒక్కోటీ అవినీతి మరకలు, వివాదాలు, ఆరోపణలు చుట్టు ముడుతూనే ఉన్నాయి. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో వేలు పెడుతున్నారు.., పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అంతుపట్టడం లేదు.., పార్టీలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అంటూ సొంత పార్టీలోనే గుసగుసలు మొదలయ్యాయి. మధ్య మధ్యలో కుమారుడి పెత్తనం కూడా ఎక్కువయింది అనే ఆరోపణలు వినిపించినప్పటికీ.., ఆయనే కల్పించుకుని సరిదిద్దారు. ఎంత జాగ్రత్త పడినప్పటికీ కొన్ని ఆరోపణలు, మరకలు అలాగే ఉన్నాయి. సొంత మనుషుల్లోనే “మా వాసన్న గతంలో ఇలా లేరు. కానీ ఎందుకో ఈ సారి బాగా వినిపిస్తుంది. మార్పు వచ్చింది. ఇలాగైతే కష్టమే, చాలా సరిదిద్దుకోవాలి” అనే మాటలు వచ్చేవి. ఈ క్రమంలోనే గత నెలలో ఆయన రష్యా టూర్ వేసి వచ్చాక పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఆయన మాట, ప్రవర్తనలో కూడా కొంత మేరకు మార్పు వచ్చింది..

  • రష్యా ఆయన ఎందుకు వెళ్లారు..? ఎలా వెళ్లారు..? అనేది పక్కన పెడితే ఆయన వెళ్లిన ఫోటోలను ఆయనే బయటపెట్టారు. దీన్ని ప్రతికూల మీడియా, ప్రతిపక్షం చాలా రచ్చ చేసింది. చివరికి ఆయనే స్పందించి “నా వ్యక్తిగత టూర్. ఇది తప్పా..? ఒక మంత్రి అయితే ఇలా విదేశాలకు వెళ్లకూడదా..!? నాతో పాటూ ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా ఉన్నారు..!” అంటూ చెప్పారు. దీంతో పార్టీ పెద్దల్లో కాస్త అసహనం వ్యక్తమైనట్టు తెలిసింది.
Balineni Sreenivasa Reddy: Changing in Subject to Party Issues
  • ప్రతిపక్ష ఎమ్మెల్యేతో అధికార పార్టీ మంత్రి విదేశాలకు వెళ్లడం ప్రజల్లో అంత మంచి సంకేతాలు ఇవ్వదని.., పైగా మీడియాకు చెప్పడం, ఫోటోలు లీక్ చేయడంపై పార్టీ పెద్దలు బాలినేనితో కాస్త సీరియస్ గానే చర్చించినట్టు సమాచారం. అన్ని అంశాలపై మంత్రి వివరణ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత ఒంగోలులో సీఎం పర్యటన కూడా చేయించారు.
  • రష్యా వెళ్లి వచ్చిన తర్వాత ఓ సందర్భంలో మాట్లాడుతూ “మొత్తం మంత్రి వర్గం మార్చేస్తారని సీఎం చెప్పారు. అందర్నీ తీసేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు. మార్చండి, మంచిదే అన్నాను. నాకేం భయం లేదు. తప్పు చేసేవాడు భయపడాలి” అన్నారు. ఈ వ్యాఖ్యల్లో కాస్త లోతుగా ఆలోచిస్తే.. మంత్రిగా తీసేస్తే భయం ఎందుకు..!? ఉంటె బాధ ఉంటుంది, లేదా పార్టీ బాధ్యత ఉంటుంది.. కానీ ఇక్కడ బాలినేని భయం లేదు అనడంపై కొంత చర్చ జరిగింది..!
  • ఆ తర్వాత నెమ్మదిగా బాలినేని జిల్లాలో యాక్టీవ్ అవ్వడం.. సీఎం జిల్లాకు వచ్చిన సందర్భంలో కీలకంగా వ్యవహరించడం.., విబేధాలు, వివాదాలు పరిష్కరించుకునే ప్రయత్నాలు చేయడం.., తాజాగా మాగుంట జన్మదినాన్ని హాజరవ్వడం ప్రత్యేకమే. 2019, 2020 లో బాలినేని ఇలా వెళ్ళలేదు. కానీ మొన్న మాత్రమే వెళ్లి, శుభాకాంక్షలు తెలిపారు. గత రెండేళ్లలో కనీసం సామజిక మాధ్యమాల్లో కూడా శుభాకాంక్షలు తెలియజేయలేదు. కానీ ఈ ఏడాది నేరుగా వెళ్లి, కాసేపు గడిపి వచ్చారు..
Balineni Sreenivasa Reddy: Changing in Subject to Party Issues

మాగుంటతో వీడినట్టేనా..!?

మాగుంట పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి బాలినేని వెళ్లడం ప్రత్యేకమే.. ఎందుకంటే.. ఆ ఇద్దరికీ మధ్య అంత సానుకూలత లేదు. కరోనా రెండో దశ పీక్స్ లో ఉన్నప్పుడు ఒంగోలు రిమ్స్ దగ్గర కరోనా సేవా కేంద్రం ఏర్పాటు సందర్భంగా ఇద్దరికీ వివాదం తలెత్తింది. మొదట “మాగుంట కోవిడ్ సేవా కేంద్రం” అంటూ ఎంపీ మాగుంట ముందుకు రాగా.. ఆ తర్వాత బాలినేని ముందుకు వచ్చి.. ఆ మాగుంట బోర్డులు తీయించి తన సేవా కేంద్రం పెట్టించారు. దీనిపై మాగుంట మీడియా ముఖంగానే అసహనంగా వ్యాఖ్యలు చేశారు.

  • కరోనా రెండో దశ పీక్స్ లో ఉన్నప్పుడు మాగుంట రిమ్స్ ఆసుపత్రికి పరుపులు, మంచాలు పంపిస్తే చాలా రోజులు వాటిని వాడకుండా పక్కన పెట్టేసారు. చివరికి మాగుంట నేరుగా కలెక్టర్ దగ్గరకు వెళ్లి ఇదేమిటి..? సేవ కూడా చేయకూడదా..!? అంటూ ప్రశ్నించారు. దీని వెనుక సొంత పార్టీలోనే రాజకీయం ఎక్కువయింది అంటూ మాగుంట వర్గం వ్యాఖ్యలు చేసింది..
  • ఒంగోలు మున్సిపల్ ఎన్నికలు సందర్భంగా మాగుంట పెద్దగా బాధ్యతలు తీసుకోలేదు. ప్రచారం కూడా చేయలేదు. ఎవరికీ ఆర్థిక సాయమూ అందించలేదు. అంతకు ముందు బాలినేని వర్గం అనుకునే వాళ్ళు ఎవ్వరూ మాగుంట ఇంటికి కూడా వెళ్లేవారు కాదు. గత రెండేళ్లు మాగుంట పుట్టినరోజుకి బాలినేని వెళ్ళలేదు సరికదా.., తన వర్గీయులు ఎవరు వెళ్లినా ఆరా తీసేవారు.
  • జిల్లాలో అప్పుడప్పుడూ కొన్ని అధికారిక కార్యక్రమాలు తప్పితే.. ఏ నాడూ పార్టీ కార్యక్రమాలు, కీలక కార్యక్రమాలు ఇద్దరూ కలిసి నడిపించిన సందర్భాలు లేవు. మాగుంట వర్గంలో బాలినేని తీరుపై.. బాలినేని వర్గంలో మాగుంట తీసుపై పీకల్లోతు అసహనం, అసమ్మతి ఉండేది.. చివరికి అవన్నీ మర్చిపోయి ఇటీవల రెండు ధృవాలు కలుస్తున్నాయి.
Balineni Sreenivasa Reddy: Changing in Subject to Party Issues

బాలినేని మెత్తబడినట్టేనా..!?

ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే బాలినేని మెత్తబడినట్టే కనిపిస్తుంది.. రెండున్నరేళ్లు మంత్రిగా చేస్తున్నారు. జిల్లాలో చక్రం తిప్పారు. పెత్తనం చెలాయించారు. ఏకపక్షంగా వ్యవహరించారు. మంచీ, చెడులు మూటగట్టుకున్నారు. పైకి చెప్పుకోలేని మాటలు ఎదుర్కొంటున్నారు. పార్టీ పెద్దల్లో తనపై ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేశారు. ఇక మంత్రిగా తప్పుకోవాల్సి వస్తుందని ఆయనే చెప్పారు. అయితే బాలినేని పార్టీలో కీలకం. సీఎం జగన్ కి దగ్గరి బంధువు.. మొదటి నుండి అండగా ఉన్న నేత.. కాబట్టి పార్టీలో పెద్ద బాధ్యతలే ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.. కాకపోతే బాలినేని వైఖరిలో మార్పు వచ్చినట్టే కనిపిస్తుంది. మెత్తబడినట్టే చెప్పుకుంటున్నారు. రష్యా టూర్ నుండి వచ్చిన తర్వాత.. ముఖ్యంగా జిల్లాకు సీఎం వచ్చి వెళ్లిన తర్వాత బాలినేని వ్యవహారశైలితో చాలా మార్పులు గమనించినట్టు సన్నిహితులు పేర్కొంటున్నారు..! ఇంత పెద్ద వ్యవహారం చెప్పుకున్నా ఇక ఫైనల్ గా జరగాల్సింది జిల్లాలో మాగుంట – బాలినేని కలిసి పనిచేయడం కంటే.. “బాలినేని – వైవీ – మాగుంట” కల్మషాల్లేకుండా కలిసి పనిచేయడం.. అది జరిగితే జిల్లాలో పార్టీకి తిరుగుండదు. శ్రేణుల్లో ఉత్సాహానికి కొదవుండదు. కానీ అది జరగడం దాదాపు అసాధ్యమే..!

Exit mobile version