Home మా ఎడిటోరియల్ AP Nominated Posts: ఎందుకీ పదవులు..!? జిల్లాలో వైసీపీలో అంతర్గత రగడ.. అసంతృప్తుల జాడ..!!

AP Nominated Posts: ఎందుకీ పదవులు..!? జిల్లాలో వైసీపీలో అంతర్గత రగడ.. అసంతృప్తుల జాడ..!!

AP Nominated Posts: నామినేటెడ్ పదవుల కేటాయింపు జిల్లా వైసిపిలో చిచ్చు రేపింది.. కొత్త అసంతృప్తులను పెంచింది… పార్టీ పట్ల నిబద్ధతగల ఉన్న వారికి కూడా అన్యాయం జరగడంపై అసమ్మతి రగులుతుంది.. పదవులు వచ్చిన వారికీ ఇవేం పదవులు..? ఏం చేసుకోవాలి అనే వాదన వినిపిస్తుండగా..! పదవులు ఆశించి రాని వారు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు… ఇలా జిల్లా వైసీపీలో రెండు వైపులా అసమ్మతుల సెగ తాకుతుంది..!

AP Nominated Posts: సింగరాజు వెంకట్రావులో అసంతృప్తి భగ్గు..!!

వైసిపి ఒంగోలు నగర శాఖ అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు భార్య మీనాకుమారి “ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ” చైర్మన్ పదవి కేటాయించారు. నిజానికి ఈ పదవిని ఆయన భార్యకు కాకుండా తనకే ఇవ్వాలని ఆయన పలుమార్లు కోరారు. మూడు రోజుల కిందట సీఎం కార్యాలయం నుండి సింగరాజుకి ఫోన్ వచ్చి.. మీ భార్య వివరాలు చెప్పాలంటూ కోరారు. అప్పటి నుండి ఆయన మంత్రి బాలినేని సహా.., పార్టీలో కీలక నేతల వద్దకు వెల్తూ తన భార్యకు కాకుండా తనకే పదవి ఇవ్వాలని కోరారు. అభ్యర్ధించారు. ప్రోటోకాల్, పదవి, హోదా కోసం తన కష్టాన్ని చూసి తనకు ఆ గౌరవాన్ని కల్పించాలని కోరారు. అయినా లాభం లేకపోయింది. మహిళా రిజెర్వేషన్ లో భాగంగా ఆయన భార్యకే ఇచ్చారు. దీంతో వెంకట్రావులో అసంతృప్తి భగ్గుమంది మధ్యాహ్నం నుండి ఆయన ఎవరికీ అందుబాటులోకి రావడం లేదని సమాచారం. తన సన్నిహితుల వద్ధ సైతం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. సగం ఆనడం ఉన్నప్పటికీ.. తన పేరున హోదా ఉంటె బాగుండేదని ఆయన అంతర్గతంగా ఆవేదన చెందుతున్నట్టు సమాచారం..

AP Nominated Posts: Disappointment for District ..but

కృష్ణ చైతన్య వర్గంలో సైలెంట్ గా అసమ్మతి..!!

మరోవైపు బాచిన కృష్ణ చైతన్య వర్గంలోనూ ఉత్సాహం నీరు గారింది. బయటకు కనిపించని అసమ్మతి, అసంతృప్తి అలముకుంది. రాష్ట్రస్థాయి శాప్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ… అందరికీ తెలిసిన కీలకమైన పదవి వస్తుందని ఆశించారు. జిల్లాలో కరణం బలరాం వర్గానికి పోటీగా బాచిన చెంచు గరటయ్య వర్గం ఉండేది. అద్దంకి నియోజకవర్గం నుండి గరటయ్య నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేసారు. వైసీపీ ఆవిర్భావం నుండీ ఈ పార్టీలో కీలకంగా పని చేసారు. 2014 లో పార్టీ చెప్పిన అభ్యర్ధికి పని చేసారు, 2019 లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీ ఇంఛార్జిగా ఒక్కోమెట్టు ఎక్కుతూ కృష్ణ చైతన్య బలోపేతం చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో మంచి పదవి ఇస్తే మరింత ఉత్సాహంగా ఉంటుంది అనుకున్నారు. కానీ ఎవరికీ పెద్దగా పరిచయం లేని, ఎవరికీ పెద్దగా పని పడని.., ప్రజలతో నేరుగా సంబంధం లేని శాప్ నెట్ కార్పొరేషన్ కేటాయించడంతో ఈ వర్గంలో అంతర్గతంగా అసంతృప్తి నెలకొంది. నిజానికి రాష్ట్రస్థాయిలో కీలకమైన అయిదు కార్పొరేషన్లలో ఒకటి వీరికి వస్తుందని ఆశించారు. ఏపీఎస్ర్టీసీ లేదా ఏపీ ఎండీసీ(మైనింగ్).., సివిల్ సప్లయిస్.., అటవీ సంరక్షణకు సంబంధించి కొన్ని కీలక కార్పొరేషన్ ఆశించారు. కానీ శాప్ నెట్ ఇవ్వడంతో నిరుత్సాహం నెలకొంది. మూడు రోజుల నుండీ కార్యకర్తలు, కృష్ణ చైతన్య వర్గం మొత్తం అద్దంకి వేదికగా పార్టీ కార్యాలయం వద్ద ఉత్సాహంగా టపాసులు కూడా సిద్ధం చేసి ఉంచారు. కానీ ఈ పదవి ప్రకటనతో వారిలో ఉత్సాహం నీరు గారినట్లయింది.

AP Nominated Posts: Disappointment for District ..but

కమ్మ.., కాపు కార్పొరేషన్లలో ఒకటి ఆశించారు..!!

జిల్లాలో రెడ్డి సామజిక వర్గం ఓట్లలో ఎవరు అవునన్నా.., కాదన్నా 75 శాతం ఓట్లు వైసీపీ వెంటే ఉంటాయి. జిల్లాలోని కమ్మ, కాపు సామాజికవర్గాల్లోనే వైసీపీకి అంతగా ఆశించిన ఓటింగ్ లేదు. అందుకే ఈ రెండు కార్పొరేషన్లలో ఏదో ఒకటి జిల్లాకు కేటాయించి ఉంటె బాగుండేది అంటూ వైసీపీ సీనియర్లులోనే చర్చ జరుగుతుంది. రెడ్డి సామాజికవర్గం తరహాలోనే జిల్లాలో కమ్మ ఓటింగ్ ఎక్కువగానే ఉంది. నాలుగు నియోజకవర్గాల్లో ఆ సామాజికవర్గ ఓట్లు ప్రభావితం చేస్తాయి. ఆ ప్రాంతాల్లో పార్టీ బలహీనంగా ఉంది. అందుకే ఆ కార్పొరేషన కేటాయిస్తే కాస్త ఉత్సాహం నిండేది అంటూ చర్చించుకుంటున్నారు..

  • మంత్రి బాలినేని సిఫార్సులు కూడా కొన్ని పదవుల విషయంలో పని చేయలేదని సమాచారం. ఆయన పంపించిన పేర్లలో కూడా కొందరికి పదవులు ఇవ్వలేదని అంటున్నారు. వరికూటి సోదరులు, ఒంగోలుకు చెందిన శేషారెడ్డి ఎక్కువగా నిరుత్సాహంతో ఉన్నారు.
Exit mobile version