Home వార్తలు CM Jagan Delhi Tour: ప్రధాని మోడీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం...

CM Jagan Delhi Tour: ప్రధాని మోడీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం జగన్ భేటీ

CM Jagan Delhi Tour: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో వేరువేరుగా భేటీ అయ్యారు. ముందుగా ప్రధాని మోడీతో భేటీ అయిన సీఎం జగన్.. దాదాపు 45 నిమిషాల పాటు రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రుణ పరిమితిపై సీలింగ్ ఎత్తివేత, పోలవరం ప్రాజెక్టు పెండింగ్ బకాయిలు, కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని హామీలు తదితర అంశాలపై చర్చించి వినతి పత్రాన్ని అందజేశారు. అదే విధంగా దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి జరిగిన ఒప్పందాల విషయాలను మోడీకి వివరించినట్లు తెలుస్తొంది. ఇదే సందర్భంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు చర్చకు వచ్చాయని భావిస్తున్నారు. త్వరలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ మద్దతు అంశంపైనా చర్చ జరిగి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మోడీతో భేటీ ముగిసిన అనంతరం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం జగన్ సమావేశమైయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.17వేల కోట్ల విడుదల చేయాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. నిధుల సమీకరణకు ఆటంకాలు లేకుండా బ్యాంకర్లకు ఆదేశాలకు ఇవ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ వెంట వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు. కాగా ఈ రాత్రి జగన్ ఢిల్లీలోనే బస చేయనున్నారు. రేపు (శుక్రవారం) ఉదయం 10గంటలకు కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Exit mobile version