Home వార్తలు పోలింగ్ కేంద్రాలకు నెట్ వర్కు సౌకర్యం : హరేంధ్ర ప్రసాద్

పోలింగ్ కేంద్రాలకు నెట్ వర్కు సౌకర్యం : హరేంధ్ర ప్రసాద్

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాలకు నెట్ వర్కు సౌకర్యాన్ని కల్పించాలని అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎమ్.ఎన్.హరేంద్ర ప్రసాద్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో టెలీకం సర్వీస్ ప్రొవైడర్లతో ఆయన సమావేశమై నెట్ వర్కు సౌకర్యాన్ని పెంచే అంశంపై సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 46, 165 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వాటిలో 50 శాతం పోలింగ్ స్టేషన్లలలో జరిగే పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ చేయనున్నట్లు తెలిపారు. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ నిధులను వినియోగిస్తూ షాడో ఏరియాలోని 689 పోలింగ్ స్టేషన్లకు టవర్ల సౌకర్యాన్ని కల్పించే పనులను వేగవంతం చేయాలన్నారు. ఎన్నికలలో పోటీ చేయనున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు బల్క్ ఎస్.ఎం.ఎస్ ద్వారా చేయనున్న ప్రచారానికి ఎంసీఎంసీ నుండి ముందస్తు అనుమతిని తప్పనిసరిగా పొందాల్సి ఉందన్నారు. ఈ విషయాన్ని సర్వీస్ ప్రొవైడర్లు తప్పని సరిగా పరిశీలించాల్సి ఉందన్నారు. ఇందుకై వీరు చేసే ఖర్చును అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో పేర్కోవాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ కేంద్రాల వద్ద కౌంటింగ్ కు ముందు రోజు, కౌంటింగ్ నిర్వహించే రోజు నిరంతరాయంగా నెట్వర్క్ సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో టెలీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మనోజ్ కుమార్, సహాయ సీఈవో తాతబ్బాయి, టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల ప్రతినిథులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version