Home Uncategorized ఐరన్ నిక్షేపాలను జిందాల్ కి కేటాయించడం రాష్ట్ర అభివృద్ధికి విఘాతం : వి.శ్రీనివాసరావు

ఐరన్ నిక్షేపాలను జిందాల్ కి కేటాయించడం రాష్ట్ర అభివృద్ధికి విఘాతం : వి.శ్రీనివాసరావు

ప్రకాశం జిల్లా యర్రజర్ల కొండ ఐరన్‌ నిక్షేపాలను విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనుల కింద కేటాయించాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌ రెడ్డికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు బుధవారం సిఎస్ కు లేఖ రాశారు. ఒంగోలు రూరల్‌ మండలం యర్రజర్ల, టంగుటూరు మండలం కొణిజేడు, మర్లపాడు, కందులూరు గ్రామాల పరిధిలో 1307 ఎకరాలు కొండ ప్రాంతంలో ఉన్న (65.85 మిలియన్‌ టన్నుల) లోగ్రేడ్‌ మాగట్కెట్‌ ఇనుప ఖనిజ నిక్షేపాలను జిందాల్‌ అప్పగించడం సరైందికాదన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అవసరమని కోరినప్పటికీ కేటాయించకపోవడం దారుణమన్నారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కల్గించే చర్యని ఆందోళన వ్యక్తం చేశారు. ఐరన్‌ నిక్షేపాలను జిందాల్‌ కు కేటాయించడాన్ని ఆపి విశాఖ ఉక్కుకు కేటాయించాలని కోరారు. యర్రజిల్ల ఇనుప ఖనిజంలో 30 శాతం ఐరన్‌ ఓర్‌ ఉంటుందని బెనిఫికేషన్‌ ద్వారా ఐరన్‌ కంటెంట్‌ పెంచి స్టీల్‌ తయారీకి వినియోగిస్తారని తెలిపారు. 15 సంవత్సరాల క్రితం అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేటు కంపెనీల ద్వారా త్రవ్వకం, ప్రాసెసింగ్‌, అమ్మకం చేపట్టాలని నిర్ణయించిందని.. గతంలో జింప్లెక్స్‌ కంపెనీకి ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకమన్నారు. మరలా 2023 ఫిబ్రవరి 22 వ తేదీన బెనిఫికేషన్‌ కొరకు టెండర్‌ పిలిస్తే జిందాల్‌ స్టీల్‌ కంపెనీ దక్కించుకుందన్నారు. యం.యం.డి.ఆర్‌.చట్టం 1956కి భిన్నంగా రాబడిలో 11% యం.డి.సి.కి, 89% జందాల్‌ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసిందని.. 15 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని త్రవ్వే విధంగా టెండర్‌ ఇచ్చారన్నారు.


2003 ధరల ప్రకారం ప్రపంచ మార్కెట్లో ఐరన్‌ టన్ను ధర రూ.4,083/ ఉందని. 11% వాటా ప్రకారం యుం.డి.సి.కి టన్నుకు రూ.449.13 లు, జిందాల్‌ కంపెనీకి 89% వాటా ప్రకారం రూ. 3,638.97 లు, వస్తుందన్నారు. 50 లక్షల టన్నులు త్రవ్వితే యం.డి.సి.కి రూ.224.56 కోట్లు, జిందాల్‌ కంపెనీ రూ.1,816.93 కోట్లు రాబడి వస్తుందని.. భారీ లాభాలు జిందాల్‌కు దక్కుతాయన్నారు. ఈ చర్య రాష్ట్ర సంపదను అక్రమంగా జిందాల్‌కు అప్పగించడమే అవుతుందన్నారు. కావున వెంటనే జిందాల్‌తో ఒప్పందం రద్దు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ సంపదను ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెట్టకుండా రాష్ట్ర ప్రజా ప్రయోనాల కోసం విశాఖ ఉక్కుకు కేటాయించాలని కోరారు.

Exit mobile version