Home Uncategorized మేనిఫెస్టోలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను చేర్చాలి : ఎస్‌.టి.యు

మేనిఫెస్టోలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను చేర్చాలి : ఎస్‌.టి.యు

రాష్ట్రంలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడానికి, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీలు తమ వైఖరిని తెలుపుతూ మేనిఫెస్టోలో చేర్చాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌.టి.యు) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్‌.సాయి శ్రీనివాస్‌, మల్లు రఘునాథరెడ్డిలు కోరారు. ఆదివారం విజయవాడ లోని దాసరి భవన్‌ నందు జరిగిన ఉపాధ్యాయ వైజ్ఞానిక శిక్షణా తరగతులు సందర్భంగా వారు మాట్లాడుతూ… రా సిపిఎస్‌ ఉద్యోగులందరికి సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. 2003 డిఎస్‌సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ అమలు చేయాలన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న జివో 117 రద్దు చేయాలని, పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా కొనసాగించాలన్నారు. కొఠారి కమీషన్‌ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో 6 శాతం, రాష్ట్ర బడ్జెట్‌లో 30 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలన్నారు. ఇప్పటివరకు కేంద్ర బడ్జెట్‌లో 3 శాతం, రాష్ట్ర బడ్జెట్‌లో 11-12 శాతం మించి కేటాయించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యారంగానికి బడ్జెట్‌లో కేటాయింపులు పెంచేలా, పై సమస్యలన్నింటిపై మేనిఫెస్టోలో ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో ఎఐఎస్‌టిఎఫ్‌ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీ కత్తి నరసింహారెడ్డి, ఎఐఎస్‌టిఎఫ్‌ ఆర్థిక కార్యదర్శి సిహెచ్‌.జోసఫ్‌ సుధీర్‌ బాబు, ఉపాధ్యాయవాణి సంపాదకులు గాజుల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.సురేష్‌ బాబు, సుబ్రహ్మణ్యం రాజు, రామచంద్రయ్య, కె.వి.రామచంద్రరావు, పి.రమణారెడ్డి, శివప్రసాద్‌, కడియాల మురళి, జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

Exit mobile version