Home వార్తలు మీకోసం పాదయాత్ర చేసిన వారు గుర్తులేరా? వైయస్సార్ ను అవమానించిన వారే గుర్తున్నారా ? :...

మీకోసం పాదయాత్ర చేసిన వారు గుర్తులేరా? వైయస్సార్ ను అవమానించిన వారే గుర్తున్నారా ? : షర్మిల

రాజశేఖర్‌ రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించిన ప్రతి ఒక్కరికీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి పెద్దపీట వేశారని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శించారు. అసెంబ్లీలో నిండు వేదికగా రాజశేఖర్‌ రెడ్డినీ తిట్టిన బొత్స సత్యనారాయణ ను జగన్మోహన్‌ రెడ్డికి తండ్రి సమానులు అయ్యారు. ఆయన కోసం పాదయాత్రలు చేసిన వారు గుర్తు లేరు. ఆయన కోసం పనిచేసి చివరకి గొడ్డలి వేటుకు బలైన వారు గుర్తు లేరని ధ్వజమెత్తారు. వైఎస్‌ షర్మిల చేపట్టిన న్యాయ యాత్ర బుదవారం బాపట్ల జిల్లాలోని రేపల్లెలోకి ప్రవేశించింది. పట్టణంలో బస్టాండ్‌ సెంటర్లో జరిగిన రోడ్‌షోల్లో ఆమె మాట్లాడుతూ…. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాడిన జగన్‌.. సీఎం అయిన తర్వాత ఒక్కసారైనా పోరాడారా? ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం అన్నారు. నేడు మధ్యపాన నిషేధం అయ్యిందా? ఇదేనా వైఎస్‌ఆర్‌ ఆశయాలను నిలబెట్టడం అంటే అని నిలదీశారు..పదేళ్ల టిడిపి, వైసిపి పాలనలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. గతంలో జగన్మోహన్‌ రెడ్డి రేపల్లెకు వచ్చినప్పుడు కృష్ణా నదిపై రెండు చెక్‌ డ్యామ్‌లు నిర్మిస్తామని, లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామని ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తామని, ఆక్వా పార్క్‌ నిర్మిస్తామని, వంద పడకల హాస్పిటల్‌ నిర్మిస్తామని ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని హామీలు ఇచ్చారు. కానీ ఒక్క హామీ కూడా నెరవేరలేదని మండిపడ్డారు. బిజెపికి సహకరిస్తున్న పార్టీలకు ఓటు ఎందుకు వేయాలి అని నిలదీశారు.టీడీపీ, వైసిపి దొందూ దొందేనని షర్మిల దుయ్యబట్టారు. ఏపీలో అభివృద్ధి కనిపించడం లేదని, పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపించారు. ఏపీపై రూ.10 లక్షల కోట్లకుపైగా అప్పుల భారం ఉందన్నారు.

కాంగ్రెస్ తోనే ప్రత్యేక హోదా సాధ్యం

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. పోలవరం పూర్తి కావాలంటే కాంగ్రెస్‌ రావాలి. ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే రాహుల్‌ గాంధీ తొలి సంతకం హామీ ఇచ్చారని వివరించారు. కాంగ్రెస్‌ తోనే అభివద్ధి సాధ్యం అని పేర్కొన్నారు.కాంగ్రెస్‌ అధికారంలో వస్తే రూ.2 లక్షలు రైతు రుణాలు మాఫీ చేస్తాం. మహిళలకు ఏడాదికి లక్ష రూపాయల సహాయం అందజేస్తాం. పేద కుటుంబానికి 5 లక్షలతో పక్కా ఇల్లు నిర్మిస్తాం. రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హౌదా కాంగ్రెస్‌ పార్టీ ఇస్తుంది. 2.25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. మొదటి సంతకం ఉద్యోగాల భర్తీ మీద ఉంటుంది అని’ షర్మిల ప్రజలకు హామీనిచ్చారు. వైఎస్సార్‌ ఆశయాలు ఒక్క కాంగ్రెస్‌లోనే నెరవేరాయని, వైఎస్సార్‌ను ప్రేమించే ప్రజలు ఆయన ఆశయాల కోసం నిలబడదామని షర్మిల పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ బిడ్డతో చేతులు కలపాలని.. ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ వైఎస్సార్‌ ఆశయాలను సిద్దింపజేద్దామన్నారు. బాపట్ల కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి జెడి శీలం రేపల్లె నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మోపిదేవి శ్రీనివాసరావుని గెలిపించాలని కోరారు.

Exit mobile version