Home వార్తలు ఓట్లు కొల్లగొట్టడానికే ఉక్కు కార్మికులతో సిఎం చర్చలు : వి. శ్రీనివాసరావు

ఓట్లు కొల్లగొట్టడానికే ఉక్కు కార్మికులతో సిఎం చర్చలు : వి. శ్రీనివాసరావు

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై రెండేళ్లు మౌనం వహించి ఎన్నికల వేళ కార్మికులకు అండగా ఉంటానని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లోపాయికారిగా చెప్పడం మోసకారితనమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు.బుధవారం విజయవాడ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….గతంలో పోరాట కమిటీ నాయకులు కలిసి మాట్లాడేందుకు అనుమతి కోరితే ఇవ్వకుండా…. ఎన్నికల కోసం వారిని పిలిపించుకొని మాట్లాడడంలో నిజాయితీ కపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను ఆపేందుకు తాను నిలబడతానని కార్మికులతో ఎక్కడా చెప్పలేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న గనులను కేటాయించేందుకు కూడా హామీ ఇవ్వలేదన్నారు.

మూడేళ్ళలో ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా ఒక్కసారి కూడా విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆపమని ప్రధానిని కోరలేదని మండిపడ్డారు. విశాఖ వచ్చిన ప్రధానికి కనీసం అర్జీ కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు విషయంలో వైసిపి, టిడిపి, జనసేనలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.మూడు పార్టీలు ఒకవైపు ప్రయివేటీకరిస్తున్న బిజెపికి మద్దతునిస్తూ…. మరోవైపు పోరాడుతున్న కార్మికుల పక్షం తామున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. కార్మికుల పక్షం ఉండటం అంటే ప్రైవేటీకరణను అడ్డుకోవటమేనని సూచించారు. రానున్న ఎన్నికల్లో ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తున్న వామపక్షాలను ఆదరించాలని కోరారు.

Exit mobile version