Home Uncategorized బిజెపి తో ప్రత్యక్ష, పరోక్ష పొత్తులు వద్దు : చలసాని శ్రీనివాస్

బిజెపి తో ప్రత్యక్ష, పరోక్ష పొత్తులు వద్దు : చలసాని శ్రీనివాస్

ఆంధ్ర ప్రదేశ్ కు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది.గత జనవరిలో మొదలైన పెట్రోలియం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కు 50% రాయల్టీపై స్టాండింగ్ కమిటీ రికమండేషన్ పై కేంద్ర ప్రభుత్వం మాట్లాడలేదు.పైగా 24 గంటల క్రితమే వేలాది పరిశ్రమలకు గుజరాత్లో మోడీ శంకుస్థాపన చేసి దాదాపు తొమ్మిది లక్షల కోట్ల రూపాయల పరిశ్రమల్ని అక్కడకి తరలించుకుపోయారని ఆంధ్రప్రదేశ్ విభజన హామీల సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. విజయవాడ లో ప్రత్యేక హోదా ,విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి, నాయకులు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. తమ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై, ఒక తరం దెబ్బతినడంపై కడుపు మండిన యువత విద్యార్థులు ఆగ్రహంతో రగిలిపోతున్నారని.. వారిని తెలివిగా రాజకీయ భావోద్వేగాలకు కొంతమంది గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.మోడీ అండ్ కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ కు చేసిన నమ్మకద్రోహంపై 2018 లో చంద్రబాబు నాయుడు గట్టి పోరాటం చేసి ఇబ్బందులు పడ్డారు. జగన్మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్ లు కూడా ఏపీకి దారుణ అన్యాయం జరుగుతుందని అన్నారని, ఇప్పుడు అదేవీరు, వారిని ఆంధ్రప్రదేశ్ కు ఆహ్వానించడంలో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు .ఢిల్లీలో ఆత్మగౌరవం తాకట్టు పెట్టడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో వారిని పిలిచి పాదాభివందన సభ నిర్వహిస్తున్నారా అని ఎద్దేవా చేశారు. దయచేసి బీజీపీ పార్టీతో ప్రత్యక్ష లేదా పరోక్ష పొత్తు వద్దని ఈ పార్టీల్ని కోరుతున్నామని అన్నారు.

సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వైవి రావు మాట్లాడుతూ కేంద్రం చేస్తున్న దుర్మార్గ విధానాలు తెలిసి కూడా రాష్ట్ర పార్టీలు వాళ్ళ వెనకబడటం శోచనీయమని, ప్రజలకు ఇలాంటి వాళ్ళని ఎన్నుకోవాలో లేదో తెలుసని అన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో యువజన హామీలు సాధనలో తమ పార్టీ ముందు నుంచి ఉందని కచ్చితంగా సాధన సమితి చేసే ఏ కార్యక్రమాలనైనా కలిసి చేస్తున్నామని ప్రజలు ఆలోచించి బిజెపి అనుకూల పార్టీల్ని, మోసం చేసిన వారిని దూరం పెట్టాలని నిజాయితీగా పోరాడేవారిని గెలిపించాలని అన్నారు.ఫిబ్రవరి 29 లోపు ప్రత్యేక హోదా విభజన హామీలు, విశాఖ ఉక్కు, కేజీ బేస్ నుంచి మొదలైన ముడిచమురు, గ్యాస్ విలువలో 50% రాయల్టీ ఆంధ్ర ప్రదేశ్ కి రావాలనే దానిపై మ్యానిఫెస్టోలోనే మాత్రమే కాదు స్పష్టమైన కార్యాచరణ రాష్ట్ర ప్రధాన పార్టీలు ప్రకటించకపోతే వాళ్లందర్నీ నిలదీస్తామని హెచ్చరించారు.


సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ 10 సంవత్సరాలు ఉద్యమం ఏ రోజూ ఆగలేదని ఇక మున్ముందు కూడా ఆగదని, ఆంధ్రుల హక్కుల కోసం కచ్చితంగా కొనసాగుతుందని అన్నారు. కేజ్రీవాల్ గారిని ఇండియా కూటమి నుంచి బయటకు రమ్మని పెట్టే బెదిరింపుల్లో 100 వంతు ఆంధ్ర ప్రదేశ్ ఇంకో రాష్ట్రాల మీద పెడితే డెవలప్ అవుతాయి కదా అంటూ, హోదా విభజన హామీల సాధన ఉద్యమానికి సంపూర్తిగా మద్దతు ఉంటుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఫణిరాజు అన్నారు. తమ హక్కుల కోసం వెంకయ్య నాయుడు ఇంటి ముందు ప్రాణ త్యాగానికి కూడా తాను సిద్ధపడ్డానని ఈరోజు వరకు సాధన సమితి ఏ కార్యక్రమం ఇచ్చినా అందరూ కలిసి పనిచేస్తున్నామని, మున్ముందు కూడా పనిచేస్తామని బీసీ సంఘాల మరియు సమితి నేత తాటికొండ నరసింహారావు అన్నారు. ఇంకా సమావేశంలో ప్రముఖ వైద్యులు ఉప్పల రఘురామ్, జై భారత్ నేషనల్ పార్టీ కార్యదర్శి రవికిరణ్, సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, గుంటూరు జిల్లా సమితి అధ్యక్షులు పి. మల్లికార్జునరావు, యువజన నాయకులు షేక్ జిలాని, గోవిందరాజులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.