Home వార్తలు Prakasam News: రాములోరికి కోపం వచ్చిందంట..? మునగపాడు గ్రామస్తుల ఆందోళన..?

Prakasam News: రాములోరికి కోపం వచ్చిందంట..? మునగపాడు గ్రామస్తుల ఆందోళన..?


Prakasam News: వేప చెట్టుకు పాలు కారుతున్నాయనీ, వినాయకుడు పాలు తాగుతున్నాడనీ, సాయి బాబా విగ్రహం నుండి వీపూధి పడుతోందనీ ఇలా అనేక ఘటనలు గ్రామాల్లో ప్రచారం జరగడం చూశాం. తాజాగా ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం మునగపాడు గ్రామంలో అటువంటి చిత్రమైన ఘటనే చోటుచేసుకుంది. గ్రామంలోని రామాలయంలో సీతారాముల విగ్రహం కళ్ల నుండి నీరు కారుతుండటం ఆశ్చర్యాన్ని కల్గించింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చుట్టుపక్కల గ్రామాలకూ పాకింది. దీంతో ఈ వింతను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ఆలయానికి బారులు తీరారు. అయితే దీనిపై ఆలయ పూజారి స్పందించారు. ఇటీవల తాను విగ్రహాలు శుభ్రపరిచే సమయంలో చింతపండు వాడాననీ, అందువల్ల నీరు కారుతున్నాయేమోనని సందేహం వ్యక్తం చేశారు.

అయితే గ్రామస్తులు మాత్రం ఇది ఓ సంకేతంగా చెబుతున్నారు. గత రెండేళ్లుగా ఈ రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం లేదనీ, అందుకే రాములోరికి కోపం వచ్చిందేమోనని సందేహ పడుతున్నారు. అందుకే విగ్రహం కళ్ల వెంట నీళ్లు వస్తున్నాయని వారు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఇది చెడు సంకేతంగా వారు ఆందోళన చెందుతున్నారు. స్వామివారిని శాంతింపజేసేందుకు ఉత్సవాలు చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. శాస్త్ర సాంకేతికంగా మానవులు ముందుకు సాగుతున్నా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు, మూడ భక్తి ఇంకా కొనసాగుతున్నాయి అనడానికి ఇదీ ఓ ఉదాహరణగా నిలుస్తుంది.

Exit mobile version