Home వార్తలు ఎన్నికల హామీలను ఏ మేరకు నెరవేర్చారని ప్రశ్నించండి : జగన్మోహన్ రెడ్డి

ఎన్నికల హామీలను ఏ మేరకు నెరవేర్చారని ప్రశ్నించండి : జగన్మోహన్ రెడ్డి

గతంలో కూటమి కట్టిన ముగ్గురే మళ్ళీ కలిసి ప్రజలను మోసగించేందుకు వస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారో ఎన్డీయే అభ్యర్థులను ప్రశ్నించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు. ఆనాడు చేసిన ఎన్నికల వాగ్దానాలు నీటి మీద రాతలేనని విమర్శించారు. పిఠాపురం ఎమ్మెల్యేగా లోకల్ హీరో అయిన వంగా గీత కావాలా……చీటికీమాటీకి హైదరాబాద్ పారిపోయే సినీ హీరో పవన్ కళ్యాణ్ కావాలా తేల్చుకోవాలని ప్రశ్నించారు. శుక్రవారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర 18వ రోజు కాకినాడ ఏడిబి రోడ్డులో జరిగింది. ఈ సందర్భంగా జగన్ కూటమిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బహిరంగసభలో వైకాపా శ్రేణులనుద్దేశించి మాట్లాడుతూ…. బిజెపి,జనసేన,కాంగ్రెస్ పార్టీల బి ఫారం లు వేరువేరైనా ….యూనిఫారం మాత్రం చంద్రబాబుదేనని విమర్శించారు. ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎవరైనా సరే చంద్రబాబు చెప్పిన వారికే సీటని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సూచనల మేరకు ప్యాకేజి స్టార్ పవన్ కళ్యాణ్ పనిచేస్తారని,అయన కూర్చోమంటే కూర్చుంటారని,నిలబడమంటే నిలబడతాడని ఎద్దేవా చేశారు. జ్వరం వస్తే పిఠాపురం నుండి హైదరాబాదు పారిపోవడం పిఠాపురం పట్ల చులకన భావాన్ని తెలియజేస్తుందన్నారు. పెళ్లిళ్ళే కాదు ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగయ్యాయన్నారు. చంద్రబాబు తన చంకలో పిల్లిని పిఠాపురంలో వదిలారని ఇది గాజు గ్లాస్ పరిస్థితని ఎద్దేవా చేశారు.

ఎన్డీయే కూటమిలో ఉన్న వదినమ్మ బాబు కాంగ్రెస్ లో చేరమంటే కాంగ్రెస్ లో,బిజెపిలో చేరమంటే బిజెపి లో చేరింది….బాబు చెపితే తన తండ్రినే వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు. బాబు ఎవరికీ సీటివ్వమంటే వారికే వదినమ్మ సీటిస్తుందన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో రంగురంగుల ప్రపంచాన్ని చూపిస్తుందని, ఎన్నికల య్యాక వాస్తవికత ప్రజలకు అర్థమవుతుందన్నారు.నా మీద వేయటానికి చంద్రబాబు వద్ద గులకరాయే మిగిలిందని విమర్శించారు.వారికి స్టార్ క్యాంపైనర్లు కావాలేమో కానీ తనకు ప్రజలే స్టార్ క్యాంపైనర్లు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్,కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి,రూరల్ అభ్యర్థి కురసాల కన్నబాబు, పెద్దాపురం అభ్యర్థి దవులూరి దొరబాబు, పిఠాపురం అభ్యర్థి వంగా గీత,జగ్గంపేట అభ్యర్థి తోట నరసింహం, ప్రతిపాడు అభ్యర్థి వరుపుల సుబ్బారావు,తుని అభ్యర్థి దాడిశెట్టి రాజా లను పరిచయం చేశారు.అదే విధంగా కాకినాడ పార్లమెంటుతో పాటు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలలో వైకాపా అభ్యర్థు లను గెలిపించాలని కోరారు.గతంలో జరిగిన గులకరాయి దాడి నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. భద్రతను నిరంతరం పర్యవేక్షించే చర్యలు చేపట్టేలా కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేసి పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.

Exit mobile version