Home వార్తలు Amaravathi Mahaa Padayatra: కొండపిలో అనూహ్య ప్రజామద్దతు.. భారీ విరాళంతో జోష్..!!

Amaravathi Mahaa Padayatra: కొండపిలో అనూహ్య ప్రజామద్దతు.. భారీ విరాళంతో జోష్..!!

Amaravathi Mahaa Padayatra: అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ప్రకాశం జిల్లాలో పదవ రోజుకు చేరుకుంది. న్యాయస్థానం నుండి దేవస్థానం పేరుతో తిరుమలకు రైతులు పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రైతుల పాదయాత్రకు ప్రకాశం జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. టీడీపీతో సహా వివిధ రాజకీయ పార్టీల నేతలు, మహిళలు, రైతులు, యువకులు, ప్రజా సంఘాలు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పాదయాత్రకు సంఘీభావం తెలియజేస్తూ పెద్ద ఎత్తున విరాళాలు కూడా అందజేస్తున్నాయి.

రూ.55లక్షలకు పైగా విరాళం అందజేత

సోమవారం జరుగుమల్లి మండలం ఎం నిడమానురు నుండి పాదయాత్ర ప్రారంభమైంది. కొండపి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన భారీ జనసందోహం మధ్య పాదయాత్ర కొనసాగింది. టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి, టీడీపీ నియోజకవర్గ నేత దామచర్ల సత్య ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు పాదయాత్రలో పాల్గొని రైతులకు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంలో నియోజకవర్గ ప్రజలు అమరావతి జేఏసి నేతలకు రూ.55 లక్షల 842ల విరాళాన్ని అందజేశారు. దాతలను ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి, దామచర్ల సత్యలు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రాత్రి కందుకూరు మండలం విక్కిరాలపేటలో రాత్రి బస చేయనున్నారు. రైతుల పాదయాత్రకు ప్రజల నుండి వస్తున్న మద్దతుకు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం పాదయాత్రలో ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి, దామచర్ల సత్యతో పాటు వామపక్ష నేతలు పాల్గొన్నారు. రైతుల పాదయాత్రలో కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.  

Amaravathi Mahaa Padayatra: పాదయాత్రకు విశేష స్పందన

ఈ పాదయాత్ర జిల్లాలో ప్రవేశించిన మొదటి రోజు నుండి విపరీత స్పందన వస్తుంది. పర్చూరు నుండి కొండపి వరకు నియోజకవర్గాల నాయకులు, టీడీపీ శ్రేణులతో పాటూ అన్ని వర్గాల నుండి మద్దతు లభిస్తున్నట్టు కనిపిస్తుంది. టీడీపీ శ్రేణులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటాపోటీగా, స్ఫూర్తిగా చేశారు. కొండపి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్వామితో పాటూ.. టీడీపీ యువ నాయకుడు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య ఈ పాదయాత్ర బాధ్యతను తమ భుజాన వేసుకున్నారు. రెండు రోజుల యాత్రలో పాల్గొని మొత్తం తాముగా నడిపించారు, నడిచారు. విరాళాల సేకరణ, అందించడంలో కూడా ఏ మాత్రం తగ్గలేదు. అన్ని నియోజకవర్గాల కంటే టాప్ లో నిలిచారు. ఈ స్థాయిలో స్పందన ఏ మాత్రం ఊహించలేదని.. కొండపి నియోజకవర్గంతో స్పూర్తితో యాత్రలో మరింత ఉత్సాహం పెరిగిందని పాదయాత్ర చేస్తున్న రైతులు, మహిళలు వ్యాఖ్యానిస్తున్నారు..

Exit mobile version