Home వార్తలు జగన్ ఓడితేనే….స్థానిక సంస్థల మనుగడ : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్

జగన్ ఓడితేనే….స్థానిక సంస్థల మనుగడ : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్

స్థానిక సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రెండు నెలల్లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, వైయస్సార్సీపి పార్టీని ఓడించడానికి తీవ్రంగా కృషి చేయాలని , వైయస్సార్సీపి, బిజెపి, టిడిపి, జనసేన,సిపిఎం, సిపిఐ లకు చెందిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీ లకు, జడ్పిటిసి లకు, కౌన్సిలర్ కు, కార్పొరేటర్స్ కు పిలుపునిస్తూ సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ లో ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. విజయవాడలోని బాలోత్సవ భవన్ లో మంగళవారం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీల సమావేశాలు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా కీలక తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు.

రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి , మా నిధులు, అధికారాలను, విధులను దొంగిలించి వేశారు. నిధులు తిరిగి ఇవ్వమని రాజకీయాలకు అతీతంగా, రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని పార్టీల వైయస్సార్సీపి, టిడిపి, బిజెపి, జనసేన, సిపిఐ, సిపిఎం చివరకు అధికార పార్టీ వైఎస్ఆర్సిపి తో సహా మొదలగు పార్టీలకు చెందిన సర్పంచులు,ఎంపీటీసీలు,ఎంపీపీలు, జడ్పిటిసిలు, కౌన్సిలర్స్,కార్పొరేటర్స్ గత మూడు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటాలు చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. దీనివలన 12,918 గ్రామాలలోని 3 కోట్ల 50 లక్షల మంది గ్రామీణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మేము స్థానిక ప్రజాప్రతినిధులం ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయి, అసమర్థులుగా, చేతకాన్న వాళ్ళలా మా గ్రామాల ప్రజల చేత తీవ్ర నిందలు పడ్డాము. కానీ తప్పు మాది కాదు జగన్మోహన్ రెడ్డి తప్పు అని తెలిపారు.

జగన్ ఓడితేనే – మన మనుగడ అనే నినాదంతో అన్ని పార్టీల సర్పంచులు, ఎంపీటీసీలు,ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ ఈ రెండు నెలలు చిత్తశుద్ధితో పట్టుదలగా తమ తమ గ్రామాలలో, పట్టణాలలో పనిచేయాలని ఈనాటి రాష్ట్ర కమిటీ లోతుగా, తీవ్రంగా చర్చించి పిలుపునిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగిందని ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ తెలియజేసినారు. ఈ నెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ “నిరాహార దీక్షలు” కలెక్టరేట్ల ముందు “ధర్నాలు” చేయాలని పిలుపునిస్తూ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ రాష్ట్ర కమిటీ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి జిల్లా, రాష్ట్ర కమిటీల నాయకులు పెద్ద ఎత్తున హాజరై ప్రసంగించినారు.