Velugonda Project: గాఢాంధకారంలో ఉన్న ప్రాంతానికి దూరాన వెలుగీనుతున్న దివ్వె కనిపిస్తుంది.. ఎన్నో అడ్డంకులు దాటుకుని దరికి చేరే ప్రయత్నం చేస్తుంది.. ఆ దివ్వెను దరి చేరకుండా కొన్ని శక్తులు ఆపేస్తున్నాయి.. ఆ శక్తుల కుయుక్తులను అడ్డుకునే శక్తియుక్తులున్న ఉన్న శక్తులు కూడా ఆ పని చేయడం లేదు.. మరి ఆ దివ్వెకు విలన్ ఎవరు..!? ఆ ప్రాంతానికి విలన్ ఎవరు..!? ఆపేస్తున్న వారా..? అడ్డుకొని వారా..!? ఇప్పుడు వెలుగొండది అదే పరిస్థితి..
దశాబ్దాల తరబడి కరువుతో కొట్టుమిట్టాడుతున్న జిల్లా మనది.. భూములనమ్ముకుని బతుకులు భారంగా గడుపుతున్న ప్రాంతం మనది.. భూములు అమ్ముకుని పనికి పోదామన్న.. పనుల్లేక ఖాళీ కడుపులతో వలసలు పోతున్న దయనీయ పరిస్థితి మనది.. ఇటువంటి జిల్లాకు వెలుగొండ ప్రాజెక్టు మాత్రమే వెలుగునిస్తుంది. ప్రకాశం జిల్లాకు ప్రకాశం తీసుకురావాలంటే వెలుగొండ ద్వారా మాత్రమే సాధ్యం. కానీ ఈ ప్రాజెక్టు పూర్తి కావస్తున్న దశలో ఈ రాజకీయ అడ్డంకులు ఆందోళన కలిగిస్తున్నాయి.. 2014 పునర్విభజన చట్టంలో ఉన్నప్పటికీ కేంద్రం గెజిట్ లో ఇవ్వకపోవడం ఏమిటో..!? దానిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా నిలదీయకపోవడం ఏమిటో..!? దాన్ని సాకుగా చూపించి తెలంగాణ ప్రభుత్వం వెలుగొండ అక్రమమంటూ కేంద్రానికి ఫిర్యాదు చేయడం ఏమిటో..!? అసలు వెలుగొండకు విలన్ ఎవరు..? ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమా..? తెలంగాణ ప్రభుత్వమా..!?

Velugonda Project: ఇదీ వెలుగొండ తాజా పరిస్థితి..!!
వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి 1996లో శిలాఫలకం వేశారు. ఆ నాడే డిజైన్ పూర్తి చేసారు. పూర్తి స్థాయిలో డీపీఆర్ ఫైనల్ చేసి, నిర్మాణం మొదలయింది మాత్రం 2005 లోనే… అనేక అవాంతరాలు, అడ్డంకుల మధ్య సొరంగాలు తవ్వకం నెమ్మదిగా పూర్తి కావస్తుంది. మొదటి సొరంగం దాదాపు పూర్తయింది. రెండో సొరంగం మరో ఆరు నెలల్లో పూర్తి కావస్తుంది. అన్నీ సక్రమంగా జరిగితే వచ్చే వర్షా కాలానికి మన జిల్లా వెలుగొండ జలాలను చూడొచ్చు. పంటలు పండించుకోవచ్చు. పూర్తిస్థాయి నీటి కేటాయింపులు 53 టీఎంసీలు ఉండగా.., కనీసం 15 టీఎంసీలు ఢోకా ఉండదు. ఈ నీటితో కరువు సీమగా ఉన్న పశ్చిమాన 2 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసుకోవచ్చు.., 5 లక్షల మందికి దాహార్తి తీరుతుంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ వెలుగొండ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదులు మీద ఫిర్యాదులు చేస్తుంది. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల నీటి గొడవకి వెలుగొండకి ఏ మాత్రం సంబంధం లేదు. శ్రీశైలం జలాశయం వద్ద 875 అడుగుల నీటిమట్టం చేరిన తర్వాత మాత్రమే వెలుగొండకి నీళ్లు వస్తాయి. ఈ ప్రాజెక్టు ఏ ప్రాజెక్టుకి అడ్డంకి కాదు.. కానీ తెలంగాణ ప్రభుత్వం కుట్ర పూర్వకంగా ఫిర్యాదు చేయడం.. దానిపై ఏపీ ప్రభుత్వం కనీసం సమాధానం చెప్పకపోవడం.. వెలుగొండ వెలుగుని ఆర్పేసి ప్రయత్నాలు చేస్తున్నట్టే… ఇద్దరూ విలన్లే…

కేంద్రం గెజిట్ లో లేకపోవడం ఎవరి తప్పు..!?
2014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం వెలుగొండ ప్రాజెక్టుకి అన్ని అనుమతులు ఇచ్చారు. ఏపీ, తెలంగాణాలో కలిపి ఆరు ప్రాజెక్టులకు (నెట్టెంపాడు, కల్వకుర్తి, గాలేరు నగరి, తెలుగు గంగ, హంద్రీనీవా, వెలుగొండ) ఎలాంటి ఆటంకాలు ఉండవని.. అనుకున్నట్టే పూర్తి చేసుకోవచ్చని కేంద్రం నాటి విభజన చట్టంలో పేర్కొంది. అంటే అక్షరాలా… సర్వదా, శతధా, సహస్రధా వెలుగొండకి అనుమతులు ఇచ్చినట్టే. ఆ చట్టమే సాక్ష్యం. కానీ గత నెలలో కేంద్రం విడుదల చేసిన గెజిట్ లో వెలుగొండ పేరు లేదు. ఈ విషయాన్నీ ఏపీ ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంది. దీంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. “తెలంగాణ ప్రభుత్వం దీన్ని సాకుగా తీసుకుంది. అదిగో కేంద్రం గెజిట్ లో కూడా వెలుగొండ లేదు. అంటే ఆ ప్రాజెక్టు అక్రమం, ఆ ప్రాజెక్టుకి అనుమతుల్లేవు, వెంటనే ఆపేయండి” అంటూ ఫిర్యాదులు మీద ఫిర్యాదులు చేస్తుంది. ఇక్కడ తప్పెవరిది..? గెజిట్ లో చేర్చని కేంద్రానిదా..? గట్టిగా అడగలేని ఏపీ ప్రభుత్వానిదా..!? చిన్న పాయింట్ ని సాకుగా చూపించి ఫిర్యాదులు చేస్తున్న తెలంగాణ దా..!? తప్పు ఎవరిదైనా కావచ్చు.. ఆ శాపం మాత్రం జిల్లాకే తగులుతుంది. అందుకే ఆ శాపం తగలకుండా జిల్లా ప్రజాప్రతినిధులు గట్టిగా పోరాడాల్సిన సమయం వచ్చింది. పశ్చిమాన గొంతెత్తాల్సిన సమయం వచ్చింది..! వెలుగొండకి అసలైన విలన్లు జగనో, కేసీయారో కాదు.. మన జిల్లా ప్రజా ప్రతినిధులే…!