Ongole MP: జిల్లాలో క్షేత్రంలో బలంగా ఉన్న వైసీపీని ఢీ కొట్టే ప్రయత్నాల్లో టీడీపీ ఉంది.. అందుకు తగిన బలాలను పోగేసుకుంటుంది.. పశ్చిమ ప్రాంతంలో వైసీపీని కొట్టడం అంత ఈజీ కాదు.. కానీ ప్రయత్నం చేస్తే ఎక్కడో ఒక చోట సఫలీకృతమవుతామనే నమ్మకంతో టీడీపీ ఉంది.. నిజానికి రాష్ట్రం మొత్తం మీద ఇతర జిల్లాలతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ కాస్త చురుకుగా ఉన్నదీ ప్రకాశం జిల్లాలోనే.. ఎమ్మెల్యేలు తరచూ సీఎం జగన్ కి లేఖలు రాస్తుండడం.., పార్టీ నాయకులు తరచూ సమావేశాలు నిర్వహిస్తూ సమీక్షలు చేసుకోవడం.., జిల్లాలో పార్టీకి జోష్ నింపుతున్నాయి.. ఇక జిల్లాలో టీడీపీకి కొరకరాని కొయ్యగా మారింది “ఒంగోలు ఎంపీ” సీటు. టీడీపీ ఆవిర్భావం తర్వాత కేవలం రెండుసార్లు మాత్రమే గెలుచుకుంది.. ఎన్ని స్ట్రాటజీలు ప్రయోగించినా సఫలం కావడం లేదు. 1999లో కరణం బలరాం ప్రాబల్యం, పార్టీ బలం విజయానికి ఉపయోగపడింది. ఆ తర్వాత మళ్ళీ టీడీపీకి విజయం దక్కలేదు.. ఇప్పుడు మరో భిన్నమైన ప్రయత్నాల్లో టీడీపీ ఉంది..!
Ongole MP: ఒంగోలు ఎంపీ ఎందుకు గెలవలేరు..!?
ఒంగోలు ఎంపీ స్థానం పరిధిలో గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగిరి, దర్శి, ఒంగోలు, కొండపి శాసనసభ స్థానాలున్నాయి. ఎక్కువగా రెడ్డి సామజిక వర్గ ఓటర్ల ప్రాబల్యం ఎక్కువ. మొదటి నుండి ఈ ఓట్లు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు.. ఆ తర్వాత వైసీపీకి మళ్ళాయి.. నిజానికి రెడ్డి సామాజికవర్గం కంటే బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ రెడ్డి సామాజికవర్గ ప్రభావమే ఎక్కువ ఉంటుంది. ఒంగోలు ఎంపీ స్థానం పరిధిలో దాదాపుగా మొత్తం 14.70 లక్షల ఓట్లు ఉండగా.., రెడ్డి సామాజికవర్గ ఓట్లు సుమారుగా 3 లక్షలు ఓట్లు ఉంటే.., కమ్మ సామాజికవర్గం దాదాపు ఒక లక్షా తొంబై వేలు ఓట్లు, కాపు సామాజికవర్గం సుమారుగా ఒక లక్ష అరవై వేలు ఓట్లు ఉంటాయి. మిగిలినవి బీసీలు, ఎస్సిలు ఉండగా.. ఆర్యవైశ్య 45 వేలు, ఇతర ఓట్లు మరో 30 వేలు వరకు ఉంటాయని అంచనా.. రెడ్డి సామాజికవర్గ ప్రభావం .. వారి మాట ప్రకారం బీసీలు, ఎస్సీలు ఆ పార్టీలకు సంప్రదాయకంగా అండగా ఉండడంతో ఇక్కడ కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ పాతుకుపోయింది. 1999లో మాత్రం కరణం బలరాం గెలుపునకు కమ్మ సామాజికవర్గానికి తోడు, కాపు, బీసీలు బాగా పని చేశారు. ఆ ఫార్ములా మళ్ళీ టీడీపీకి వర్కవుట్ అవ్వలేదు. మాగుంట కుటుంబం పాతుకుపోయింది. రెడ్డి, బీసీల్లో ఎక్కువగా మాగుంట అల్లుకుపోయారు. పెద్దగా చేసిందేమి లేకపోయినప్పటికీ.. వివాదరహితుడిగా, శ్రేణుల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ బలమైన నాయకుడిగా ఎదిగారు.

Ongole MP: టీడీపీ కొత్త ఫార్ములా..! కదిరి వైపు చూపు..!!
తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కొత్త ఫార్ములా వైపు చూస్తుంది. కాపు సామాజికవర్గ నాయకుడికి సీటు ఇవ్వడం ద్వారా సీటుపై పట్టు పెంచుకోవచ్చనేది పార్టీ యోచన. కాపు నాయకుడికి టికెట్ ఇస్తే.. పార్టీకి అండగా ఉండే కమ్మ వర్గంతో పాటూ.., కాపు వర్గం కూడా కలిసి పని చేస్తే రెడ్డి సామాజికవర్గానికి ధీటుగా ఎదుర్కొనే వీలుందనేది పార్టీ అంతర్గత ఆలోచన. అందుకు ఒంగోలు పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా పరిచయాలున్న కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు అయితే బాగుంటుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. కనిగిరి ఎమ్మెల్యేగా పని చేయడం.., దర్శిలో కూడా మంచి పట్టు ఉండడం.., ఒంగోలు, గిద్దలూరు ప్రాంతాల్లో పరిచయాలు బాగా ఉండడంతో ఆయన అయితే టీడీపీ ప్రయత్నాలు ఫలించే వీలుందని పార్టీలో మెజారిటీ నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇటీవల ఓ అంతర్గత సమావేశంలో కూడా ఎక్కువ మంది నేతల్లో ఇదే అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. అయితే కదిరి బాబూరావు వైసీపీలో చేరడం.. 2019 ఎన్నికల్లో టీడీపీ చేసిన ద్రోహం పట్ల రగిలిపోతుండడంతో ఆయనను ఎలా కన్విన్స్ చేయాలా..? అనే యోచనలో ఉంది. కదిరి బాబూరావుకి అత్యంత సన్నిహితుడు నందమూరి బాలకృష్ణ ద్వారా ఓ సారి మాట్లాడే ప్రయత్నాల్లో పార్టీ ఉన్నట్టు సమాచారం.

కదిరి అంగీకరిస్తారా..!?
టీడీపీ అయితే అనుకుంటుంది.. లెక్కలు వేసుకుంటుంది.. అంచనాల్లో ఉంది.. కానీ ఇటువైపు నుండి కదిరి బాబూరావు ఎంత మేరకు అంగీకరిస్తారు అనేది పెద్ద ప్రశ్న..!? కదిరి బాబూరావు మొదటి నుండి టీడీపీకి కంకణబద్ధుడిగా పని చేశారు. రెండు దశాబ్దాలకు పైగా పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గం ప్రభావం ఉన్న కనిగిరిలో గెలిచి, అందర్నీ కలుపుకుని పశ్చిమాన పార్టీకి కీలకంగా వ్యవహరించారు. అటువంటి నాయకుడిని 2019 ఎన్నికల్లో టీడీపీ ఊహించని షాక్ ఇచ్చింది. అప్పుడే పార్టీలోకి వచ్చిన మాజీ ఉగ్ర నరసింహారెడ్డి కోసం కనిగిరి నుండి కదిరిని దూరం చేసింది. అయిష్టంగానే కదిరి బాబూరావు దర్శి నుండి పోటీకి దిగారు. ఆర్ధికంగా కూడా చాలా నష్టపోయారు. పార్టీ నుండి ఏ మాత్రం భరోసా దక్కలేదు. అటు కనిగిరికి దూరమవ్వడం.., ఇటు దర్శి కలవకపోవడంతో కదిరి బాబురావు సైలెంట్ అయ్యారు. చివరికి పార్టీ చేసిన ద్రోహం తట్టుకోలేక, ఇక పార్టీని నమ్మలేక సీఎం జగన్ ఆహ్వానం మేరకు వైసీపీలో చేరారు. ప్రస్తుతం అప్పుడప్పుడు కనిగిరి వస్తూ తన శ్రేణులతో కలుస్తున్నారు. తెరవెనుక మాత్రమే ఉన్నారు. పార్టీపై ఆగ్రహంతో, బాధతో వెళ్ళిపోయిన కదిరి బాబూరావుని మళ్ళీ టీడీపీ లోకి తీసుకురావడమే ఒక పెద్ద సమస్య అనుకుంటే.., ఆయనను ఒంగోలు ఎంపీ సీటు నుండి పోటీకి ఒప్పించడం మరో పెద్ద సమస్య..! “తాను మళ్ళీ పార్టీ మారే ప్రసక్తే లేదని, టీడీపీ చేసిన ద్రోహాన్ని జీవితకాలం మర్చిపోనని.., వైసీపీ పరిపాలన బాగుందని.., సీఎం జగన్ పై తనకు నమ్మకం ఉందని, తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని” ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారట..!