Home వార్తలు రాష్ట్రంలో సైకో పాలన అంటూ చంద్రబాబు ధ్వజం

రాష్ట్రంలో సైకో పాలన అంటూ చంద్రబాబు ధ్వజం

రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి పాలన తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బాపట్ల రోడ్ షోలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. జగన్మోహనరెడ్డి పాలనను సైకో పాలనగా అభివర్ణించారు. జగన్ పాలనలో కరెంట్ బిల్లులు, ఇంటిపన్నులు, ఆర్టిసి చార్జీలు, పెట్రో ధరలు, మద్యం ధరలు, నిత్యావసర ధరల సహా అన్నీ పెరిగాయన్నారు. కిరాణా షాప్ లో సైతం ఆన్ లైన్ పేమెంట్ లు ఉన్నాయి కానీ మద్యం షాపులో ఎందుకు లేదని ప్రశ్నించారు. ఇవి అన్నీ చూసి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని పెట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు చంద్రబాబు. ప్రజలకు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు ఈ దొంగ ముఖ్యమంత్రి దోచేస్తున్నాడని విమర్శించారు. తన దోపిడీ ఎవరికీ తెలియదని జగన్ అనుకున్నాడు కానీ ప్రజలకు అన్నీ తెలిసిపోయాయన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసిపి ఇంటికి పంపడం ఖాయమని అన్నారు.

టీడీపీ హయాంలో రోడ్లు బాగున్నాయా లేవా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఎందుకు ఇలా రోడ్డు ఉన్నాయన్నారు. రోడ్ల దెబ్బకు నా నడుం కూడా పోయిందన్నారు. కానీ రాష్ట్రాన్ని కాపాడాలనే సంకల్పంతో పోరాడుతున్నానని పేర్కొన్నారు. జగన్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడని విమర్శించారు. హైదరాబాద్ మాదిరిగా అమరావతిని తీర్చిదిద్దుదామని అనుకున్నానన్నారు. ఆనాడు అమరావతి బిల్లు పెట్టినప్పుడు జగన్ రెడ్డి సభలో ఒప్పుకున్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. అమరావతిని నిలిపివేయడం వల్ల మూడు నుంచి నాలుగు లక్షల కోట్ల సంపద నాశనం అయ్యిందని అన్నారు. జగన్ రాగానే రివర్స్ టెండర్ అని పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేశాడని దుయ్యబట్టారు. పోలవరం పూర్తి అయ్యి ఉంటే రాష్ట్రంలో అన్ని చోట్లా మూడు పంటలకు నీళ్లు అందేవని తెలిపారు.

టిడిపి ప్రభుత్వానిది దూరదృష్టి ఉంటే వైసిపి ప్రభుత్వాని హస్వ దృష్టి అని చంద్రబాబు విమర్శించారు. జగన్ రెడ్డి పాలన రాష్ట్రానికి పట్టిన అయిదేళ్ల శనిగా అభివర్ణించారు. రాష్ట్రానికి పోలవరం, అమరావతి రెండు కళ్లు అని చెబితే జగన్ ఆ రెండు కళ్లను పొడిచేశాడని అన్నారు. రాష్ట్రం నుంచి పెట్టుబడులు, కంపెనీలు పారిపోతున్నాయన్నారు. యువతకు ఉద్యోగాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే మళ్లీ అన్నా క్యాంటీన్ లు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అమలు అవుతున్న సంక్షేమ పథకాలు అన్నీ కొనసాగిస్తామనీ, ఆ పథకాల అమలునకు సంపదను సృష్టిస్తానని చంద్రబాబు తెలిపారు.

రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకుని పరిపాలన సాగిస్తున్నాడని చంద్రబాబు విమర్శించారు. బాపట్లలో ఎమ్మెల్యే అవినీతి, దందా పెరిగిపోయాయన్నారు. ఇక్కడ లేఅవుట్ వెయ్యాలి అంటే రూ.10 లక్షల కప్పం కట్టాల్సిందేనని అన్నారు. జగన్ విధానాలతో ఆక్వా రంగం తీవ్రంగా దెబ్బతిన్నదన్నారు. అధికారంలోకి వచ్చిన ఇన్నాళ్లకు జగన్ బిసిల కోసం ఒక సమావేశం పెట్టాడని అన్నారు. నాడు మనం జయహో బిసి అని సభ పెట్టాం. ఇప్పుడు అదే పేరుతో తను సభ పెట్టుకున్నాడన్నారు. బిసిల పేరు ఎత్తే అర్హత జగన్ ప్రభుత్వానికి లేదని అన్నారు చంద్రబాబు. బిసిల రిజర్వేషన్లు తగ్గడానికి కారణం జగన్ యేనన్నారు. 1999 తరువాత బాపట్లో టిడిపి గెలవలేదన్నారు. ఇప్పుడు ఇన్ చార్జ్ గా వర్మను పెట్టాననీ, ఆయనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్మను గెలిపించే బాద్యత మీది, అభివృద్ది చేసే బాద్యత నాది అన్నారు చంద్రబాబు. నియోజకవర్గంలో అందరూ వర్మ నాయకత్వంలో పని చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటరీ ఇన్ చార్జి ఏలూరి సాంబశివరావు, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Exit mobile version